Friday, April 19, 2024

Delhi: మార్గదర్శి కేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు.. 4 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఆ సంస్థ అధినేత రామోజీరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. మార్గదర్శి ఛిట్‌ఫండ్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన విషయం తెలిసిందే. సోమవారం నాటి విచారణలో పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు ఆవరణలోనే మీడియాతో మాట్లాడారు.

ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో మళ్లీ కదలిక వచ్చిందని, నాలుగు వారాల్లోగా రామోజీ రావు, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కేసులో ఏపీ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించనుందని వెల్లడించారు. పిటీషన్‌లో పొందుపరిచిన అంశాలన్నింటినీ ధర్మాసనం పరిగణలోకి తీసుకుందని, వాటన్నింటికీ నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఇదే కేసులో రామోజీ రావు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌ విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి గతంలో నోటీసులు ఇచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రెండు నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చెప్పినప్పటికీ ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రామోజీ రావు వేసిన ఎస్‌ఎల్పీ విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వక తప్పదని అన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ తరహా వ్యాపారాలు దేశంలో చాలా మంది చేయడానికి అవకాశాలున్నాయని, డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించని ఉదంతాలు ఎన్నో జరుగుతున్నాయని అన్నారు. ఈ తరహా కేసుల్లో మిగతావారిని ఒకరకంగా, రామోజీరావును మరోరకంగా చూడొద్దని కోర్టును కోరినట్టు చెప్పారు. ఈ తరహాలో డిపాజిట్లు సేకరించడం నేరమా కాదా అన్నదే తాము కోర్టును ప్రశ్నిస్తున్నామని వివరించారు. డిపాజిటర్ల జాబితా తన వద్ద ఉందని, త్వరలో కేసు విచారణ వేగవంతం అవుతుందని భావిస్తున్నానని ఉండవల్లి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement