Monday, April 29, 2024

Telangana: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. అక్టోబర్‌ జీతంతోపాటు డీఏ చెల్లింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అన్ని ఆర్టీసీ డిపోలను లాభాల బాట పట్టించే దిశగా మరిన్ని నూతన సంస్కరణలు తీసుకురానున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ వెల్లడించారు. ఆదాయం పెంపు – నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆదాయం పెంచుకునేందుకు 30 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రయాణీకులు, సంస్థ సిబ్బంది కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు. సంస్థ సిబ్బందికి ఇవ్వల్సిన బాకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించి వారికి అన్ని విధాల సహకారం అందజేస్తామన్నారు. సిబ్బంది పూర్తి విశ్వాసంతో సైనికుడిలా పని చేయాలని ఆయన కోరారు.

తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బంది కోసం మరిన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. పాదర్స్‌ డే, మదర్స్‌ డే, చిల్డ్రన్స్‌ డే, తదితర జాతీయ పండుగలను దృష్టిలో ఉంచుకుని పెద్దలకు, పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి వినూత్న కొత్త పథకాలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు తిరుపతికి వెయ్యిమంది ప్రయాణీకులను టీఎస్‌ ఆర్టీసీ చేరవేస్తుందని, బస్సులోనే దర్శనం టిక్కెట్లను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలాన్ని బాజిరెడ్డి గోవర్దన్‌ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో చేపట్టిన పలు కార్యక్రమాలను సోమవారం ఒక ప్రకటనలో ఆయన విడుదల చేశారు.

2022-23లో 300 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు ప్రవేశపెడతామన్నారు. హకీంపేట, వరంగల్‌లో రెండు ఐటీఐ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే 1200 కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌ పేరుతో జీవ వాటర్‌ బాటిళ్ళను ప్రవేశపెడతామన్నారు. అలాగే సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ స్వీపర్‌ క్లాస్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి ఈ ఏడాది అక్టోబర్‌ నెల జీతంతో పాటు డీఏను అందజేస్తామన్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించే లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ ఎండీ సజ్జనార్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, రీజినల్‌ డైరెక్టర్లు, డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్‌ స్టాఫ్‌కు ప్రత్యేక అభినందనలు బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement