Monday, May 6, 2024

నేటి నుంచే అసెంబ్లీ భేటీ.. మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: శాసనస భా వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11.30గంటలకు ఉభయ సభలు సమావేశమవుతాయని శాసనసభ సచివాలయ కార్యదర్శి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాలను మూడు రోజులపాటు నిర్వహించే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన బిల్లులను ఆమోదించడంతోపాటు తెలంగాణపట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షపూరిత విధానాలను శాసనసభ ద్వారా ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.

సెప్టెంబరు 17న తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైఖ్యతా వజ్రోత్సవాల అంశంపై సభలో చర్చించే అవకాశం ఉంది. సెప్టెంబరు 16 నుంచి మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వజ్రోత్సవాలను నిర్వహించాలని గత శనివారం సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది సెప్టెంబరు 16 నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వం నిర్వహించనుంది.

మంగళవారం ఉదయం అసెంబ్లి సమావేశం అయ్యాక ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ సంతాపం తెలుపనుంది. అనంతరం టీ. విరామం ప్రకటించి శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో శాసనసభ, శాసన మండలిని ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయన్న అంశాలను సీఎం కేసీఆర్‌ లేదా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విపక్ష సభ్యులకు వివరించే అవకాశం ఉంది. పోడు భూముల అంశంపై ఇటీవల మంత్రి మండలి సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది.

ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం అసెంబ్లిలో, శాసన మండలిలో ప్రస్తావించి ఆయా జిల్లాల్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి..?, ఇందుకు తీసుకున్న చర్యలను వివరించనుంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మరో 500 మందికి దళితబంధు పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌ శాసనసభ ద్వారా మరోసారి ప్రక టిస్తారని సమాచారం. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ కార్పోరేషన్లలో కో.ఆప్షన్‌ సభ్యుల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించి అసెంబ్లిలో ఆమోదం పొందేందుకు బిల్లును ప్రవేశపెట్టనుంది. జీహెచ్‌ఎంసీలో అయిదు నుంచి 15 వరకు, ఇతర కార్పోరేషన్లలో 5 నుంచి 10 వరకు కో.ఆప్షన్‌ సభ్యుల సంఖ్యను పెంచాలని మంత్రి మండలి తీర్మాణించింది. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్‌ అసెంబ్లి వేదికగా ఎండగట్టనున్నారు. వరదల వల్ల నష్టపోయిన జిల్లాలను కేంద్ర బృందాలు వచ్చి పరిశీలించినా ఇంతవరకు ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఒకరోజంతా చర్చ పెట్టే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా విశ్వ విద్యాలయం బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ విశ్వ విద్యాలయానికి రాణి రుద్రమ మహిళా విశ్వ విద్యాలయంగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి తేదేపా వ్యవస్తాపక అధ్యక్షుడు ఎన్టీ. రామారావు ప్రారంభించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరును మార్చే అంశంపై కూడా ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి విశ్వ విద్యాలయంగా పేరు పెట్టాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జేఎన్‌టీయూ పరిధిలో కొత్తగా వనపర్తి, సిరిసిల్లలో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం.

సమావేశాలు 20రోజులపాటు నిర్వహించాలి: సీఎల్‌పీ నేత భట్టి

శాసనసభా సమావేశాలను కనీసం 20 రోజులపాటు నిర్వహించాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రజాసమస్యలన్నింటినీ చర్చించే విధంగా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. విపక్షాలు ఎన్నిరోజులపాటు శాసనసభా సమావేశాలను నిర్వహించాలంటే అన్ని రోజులు జరుపుతామని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు. ప్రభుత్వం తన ఎజెండాను పూర్తి చేసుకుని శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేస్తోందని, గత సమావేశాల మాదిరిగా కాకుండా ఈ దఫా రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేవిధంగా సమయం కేటాయించాలని కోరారు. ఎనిమిదేళ్ల ప్రభుత్వ ఆదాయం, తెచ్చిన అప్పులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి వరద ముంపుకు గురైందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును సందర్శించడానికి సీఎల్‌పీ బృందం వెళితే ప్రభుత్వం అరెస్టు చేయించిందని, ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టును చూడకుండా అడ్డుకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన భట్టి మునుగోడులోనూ తమదే విజయమని స్పష్టం చేశారు.

శాసనసభ సభ్యత్వానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఆరు నుంచి అయిదుకు పడిపోయింది. సభలో అధికారపార్టీ తెరాసకు 103 మంది సభ్యులుండగా ఎంఐఎంకు 7, కాంగ్రెస్‌ 5, భాజపా 3 సభ్యులున్నారు. భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌పై ఆ పార్టీ అధినాయకత్వం వేటువేసింది. ఒకవర్గంపై రాజాసింగ్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. దీంతో కేవలం రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ మాత్రమే భాజపా తరుపున శాసనసభలో అడుగుపెట్టనున్నారు.

అసెంబ్లిలో పార్టీల బలాబలాలు..

తెరాస 103
ఎంఐఎం 07
కాంగ్రెస్‌ 05
భాజపా 03
ఖాళీగా 01
మొత్తం 119

Advertisement

తాజా వార్తలు

Advertisement