Monday, April 29, 2024

ఆర్టీసీకి పాఠ్యపుస్తకాల రవాణా కాంట్రాక్ట్‌… 5 కోట్ల మేర అదనపు ఆదాయం!

అమరావతి, ఆంధ్రప్రభ: పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలను రవాణా చేసే కాంట్రాక్టు ఆర్టీసీకి దక్కిందని, దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ (ఈడీ) గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు. పాఠశాలలకు ఆరు కోట్ల పుస్తకాలను చేరవేసేందుకు ప్రత్యేకంగా సురక్షితమైన బస్సులను పంపిస్తున్నామన్నారు. పుస్తకానికి 35 పైసల చొప్పున విద్యాశాఖ ఆర్టీసీకి చెల్లిస్తోందని, దీని ద్వారా దాదాపు రూ.5 కోట్ల ఆదాయం సమకూరుతుందని వివరించారు. పుస్తకాలను అన్ని మండలాల్లోని పాఠశాలలకు నేరుగా రవాణా చేస్తున్నామని, తద్వారా విద్యాశాఖకు ఇతర రవాణా ఖర్చులు ఉండబోవన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తరలించే విషయం కాబట్టి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో రవాణా చేస్తున్నామని, అయితే ఈ విషయం తెలియని వాళ్లు కొద్ది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఓ బస్సుపై టార్పాలిన్‌ కప్పి ఉండటాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేస్తున్నారని వెంకటేశ్వరరావు వివరించారు.

బస్సు రూఫ్‌ దెబ్బ తినడం వల్లే టార్పాలిన్‌ కప్పి నడుపుతున్నారని, ఆ సమయంలో వర్షం కురిస్తే అంతే సంగతులంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. పాఠ్యపుస్తకాలను రవాణా చేసే బస్సులకు అదనపు రక్షణ కల్పించేందుకే టార్పాలిన్లను ఉపయోగిస్తున్నామని, బస్సు రూఫ్‌ బాగోకపోవడం వల్ల కాదని స్పష్టం చేశారు. వర్షపు నీరు లీకౌతే పాఠ్యపుస్తకాలు తడిసి పాడవుతాయనే ఉద్దేశంతో అదనపు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. విషయం తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తూ ఆర్టీసీ ఇమేజిపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నామని ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement