Tuesday, May 7, 2024

Big story : వరద ముంపు నివారణకు ప్రత్యేక దృష్టి .. 2250 కోట్ల‌తో కొన‌సాగుతున్న ప‌నులు

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్‌ : గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌ వరద ముంపు పట్ల ఎలాంటి శ్రద్ద తీసుకోక పోవడం, సరైన చర్యలు తీసుకోలేకపోవడం మూలంగా వచ్చిన ఈ దుస్తితిని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి నివారణకు కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వరద ముంపు నివారణకు వివిధ విభాగాలైన ఇంజనీరింగ్‌ మెయింటనెన్స్‌, ప్రాజెక్టు ఎస్‌ఎన్డీపీ లేక్‌ విభాగాల ద్వారా 2250 కోట్ల విలువైన పనులను ప్రత్యేకంగా ముంపు నివారణను ముమ్మరంగా చేపట్టి పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. రూ.415 కోట్ల వ్యయంతో ఇంజనీరింగ్‌ మెయింటనెన్స్‌ ద్వారా, రూ.1006 కోట్లు ప్రాజెక్టు విభాగం ద్వారా ఎస్‌ఎన్డీపీ ద్వారా రూ.735 కోట్లు, చెరువుల మరమ్మత్తులు కోసం రూ. 94 కోట్లు కేవలం వరద నివారణ కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి.

వ్యూహాత్మక నాలా అభివృద్ది పథకం:

వరద ముంపు నివారణకు రెండు దశల్లో చేపట్టేందుకు కార్యాచరణ సిద్దం చేశారు. మొదటి దశలో ముంపు ఎక్కువగా ఉన్న ప్రాధాన్యత పనులను జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.735 కోట్ల అంచనా వ్యయంతో 37 పనులు చేపట్టారు. తలపెట్టిన 37 పనులలో 36 పనులు ముమ్మరంగా జరుగుతున్నా యి. ఒక పని ట్రాఫిక్‌ సమస్య ఏర్పడే నేపథ్యంలో పోలీసుశాఖ అనుమతి ఇవ్వవలసి ఉన్నది. చేపట్టిన 36 పనులలో 13 పనులు పలు ప్రాంతాల్లో త్వరలో పూర్తి అవుతాయి. యుద్ద ప్రాతిపాదికన పనులను వేగంగా పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ వారు విశేష కృషి చేస్తున్నారు. జూలై చివరి వరకు కొన్ని పనుల పూర్తి చేసి మిగితా అన్ని పనులు సాధ్యమైన తొందరగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వర్షం వచ్చిన పనులకు ఆటంకం కలగకుండ ప్రత్యేక మాన్సూన్‌ అత్యవసర టీమ్‌ను ఏర్పాటు చేసి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు మేన్‌, మెటీరియల్‌ను సిద్దం చేశారు. వరద తీవ్రత అధికంగా ఉన్న ఎల్‌ బి నగర్‌ కూకట్‌ పల్లి, శేరిలింగం పల్లి జోన్లలో చేపట్టిన పనుల్లో త్వరలో పూర్తి కానున్నాయి. మిగతా జోన్లలో కూడా మేజర్‌ సమస్య ఉన్న నాలా ల వరద నివారణకు చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌..

రెండు మీటర్ల లోపు వెడల్పు గల స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌కు బాక్స్‌ డ్రైన్‌ , రెండు మీటర్ల పై బడిన నాల రిటేనింగ్‌ వాల్‌, బాక్స్‌ డ్రైన్‌ పైప్‌ డ్రైన్‌, నిర్మాణాలు చేపడతారు. స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌ మరమ్మత్తులు, నిర్మాణాలతో పాటు నాలా భద్రత చర్యల్లో బాగంగా ఫ్రీ కాస్టు స్లాబ్స్‌, చైన్‌ లింక్‌ మెష్‌ పనులను చేపట్టేందుకు రూ.298 కోట్ల అంచనా వ్యయంతో 468 పనులు చేపట్టగా 139.78 కోట్ల వ్యయంతో 279 పనులు పూర్తయ్యాయి. మిగితావి 98 పనులు వివిధ అభివృద్ది దశలో ఉండగా. మరో 19 పనులు రద్దు చేయడం జరిగినది. జనరల్‌ మెయింటెయిన్‌ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 381 కోట్లతో 643 పనులు చేపట్టారు.

- Advertisement -

పూడిక తీత..

నగర వాసులు సమీప నాలాలలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు, పనికి రాని వస్తువులు వేయడం మూలంగా నీరు నిలిచి పరిసర లోతట్టు ప్రాంతాల్లో చేరడం మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాళాల్లో పేరుకొని పోయిన చెత్తను తొలగించేందుకు పూడికతీత కార్యక్రమాన్ని ఏడాది పొడవునా నిరంతరంగా చేపట్టడం జరుగుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో 56 కోట్ల31లక్షల వ్యయంతో 371 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 3.39 లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్ధాలను తీసేసారు. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న నాళాల పనులను పెద్ద నాళాలను మరమ్మత్తులు పునరుద్దరణ పనులను జీహెచ్‌ ఎంసీ చేపట్టింది. మేజర్‌ నాళాల నిర్మాణం సందర్భంగా అవసర మైన, కావాల్సిన భూసేకరణ పూర్తి చేసిన తర్వాత నే పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న మేజర్‌ నాలాలను 1006 కోట్ల అంచనా వ్యయంతో 77 పనులను చేపట్టగా ఇప్పటి వరకు వివిధ అభివృద్ది దశలో ఉన్నాయి.

చెరువుల పటిష్టత..

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు చెరువులు, కుంటలు ద్వారా ప్రవహించే వరదను అరికట్టేందుకు చెరువుల పటిష్టత కోసం స్లూస్‌ మరమ్మత్తులు, నూతన నిర్మాణాల, మురుగునీరు మళ్లింపు లాంటి పనులను చేపట్టడం మూలంగా వరదనివారణకు పరిష్కారం అవుతుందనే ఉద్దేశ్యంతో 94 కోట్ల వ్యయంతో 63 పనులు చేపట్టగా.. అందులో 47 చెరువు పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement