Monday, May 6, 2024

Delhi: తెలుగు కుర్రాడి సాహస సైకిల్ యాత్ర.. 41 రోజుల్లో చెన్నై నుంచి లేహ్ చేరుకున్న ఆశిష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: “కలలు కనండి – వాటిని సాకారం చేసుకోండి” అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెబితే, వాటికి కొనసాగింపుగా “మీరు సాకారం చేసుకోలేకపోయిన కలలను మీ పిల్లలపై రుద్దకండి” అంటున్నాడు తమిళనాడుకు చెందిన ఓ తెలుగు కుర్రాడు. ఈ మాట చెప్పడానికి ఆ అబ్బాయి ఏకంగా ఓ సాహసయాత్రనే చేపట్టి దిగ్విజయంగా పూర్తిచేశాడు. సైకిల్‌పై ఒంటరిగా చెన్నై నుంచి లద్దాఖ్ (లేహ్) వరకు సుమారు 3,500 కి.మీ మేర ప్రయాణించి మరీ నినదిస్తున్నాడు. పిల్లలకూ కలలుంటాయని, వీలైతే వాటిని గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాలని సమాజాన్ని కోరుతున్న ఆ టీనేజ్ కుర్రాడి పేరు ఆశిష్.

చెన్నైలో చీరల వ్యాపారం చేసుకునే ఉర్దనపల్లి వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు ఆశిష్ 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. సరిగ్గా ఈ దశలోనే విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్ చదవాలని కోరుకుంటే, తల్లిదండ్రులు తమకు నచ్చిన స్ట్రీమ్‌లోనే చేరాలని ఒత్తిడి చేస్తుంటారు. నిజానికి పిల్లల్ని మార్కుల మెషీన్లుగా మార్చేసి చదువు తప్ప ఆటపాటలు లేకుండా చేస్తున్నారని ఆశిష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పరిస్థితి మారాలని, తల్లిదండ్రుల్లో మార్పు రావాలన్న ఉద్దేశంతోనే తాను సైకిల్ యాత్ర చేపట్టినట్టు వెల్లడించాడు.

41 రోజుల పాటు సైకిల్ పై ప్రయాణించి లేహ్ వద్ద యాత్రను ముగించిన ఆశిష్, అక్కణ్ణుంచి తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణంలో ఆదివారం ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్ వద్ద తన యాత్రా విశేషాలను, ఉద్దేశాన్ని మీడియాతో పంచుకున్నాడు.

ఎలా మొదలైంది?
జులై 18న చెన్నై నుంచి ఆశిష్ సైకిల్‌పై బయల్దేరాడు. లద్దాఖ్ రాజధాని లేహ్ పట్టణాన్ని గమ్యస్థానంగా ఎంచుకుని, వివిధ రాష్ట్రాల మీదుగా 50 రోజుల పాటు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే 41 రోజుల్లోనే లేహ్ చేరుకున్నాడు. మైదాన ప్రాంతాల్లో రోజుకు 120-150 కి.మీ దూరం ప్రయాణించేవాడినని, అటవీ ప్రాంతం ఉన్నచోట రోజుకు 200 కి.మీ పైనే ప్రయాణం చేశానని చెప్పాడు. భుజానికి ఓ బ్యాగ్, నీళ్ల బాటిల్, సైకిల్ వెనుకాల ఏర్పాటు చేసుకున్న టెంట్‌తో ఈ ప్రయాణం సాగించాడు. రహదారుల వెంట ఉన్న ధాబాలు, రెస్టారెంట్లు, పోలీస్ స్టేషన్లలో టెంట్ వేసుకుని రాత్రిపూట బస చేసేవాడు. దారిపొడవునా తన లక్ష్యాన్ని వివరిస్తూ సాగించిన ఈ ప్రయాణంలో ఎంతోమందితో పరిచయం కలిగిందని ఆశిష్ చెబుతున్నాడు.

సవాళ్లు, సమస్యలు, లక్ష్యాలు
సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదని, చంఢీగఢ్ నుంచి హిమాలయ పర్వతాల్లోకి ప్రవేశించడంతోనే సవాళ్లు మొదలయ్యాయని ఆశిష్ చెప్పాడు. వర్షం, ప్రతికూల వాతావరణం, ఎత్తుకు ప్రయాణించడం మొదట్లో ఇబ్బందిగా మారిందని, కానీ శరీరం త్వరగానే అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా అలవాటుపడిందని చెప్పాడు. మనాలీ నుంచి లేహ్ చేరుకోడానికి వారం రోజుల సమయం పట్టిందని అన్నాడు. అయితే పర్వతాల మీదుగా ఎత్తు పెరిగేకొద్దీ చలి పెరగడం, ఆక్సీజన్ శాతం తక్కువగా ఉండడం సైక్లిస్టులకు అసలైన సవాల్ విసురుతుందని.. వాటన్నింటినీ అధిగమిస్తూ అటల్ టన్నెల్ మీదుగా తన యాత్రను ముందుకు కొనసాగించానని వివరించాడు. మాతృభాష తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లిష్, హిందీ, సంస్కృత భాషలపై పట్టున్న ఆశిష్.. తన యాత్రలో ఎక్కడా భాషాపరంగా ఇబ్బందిపడలేదని తెలిపాడు.

- Advertisement -

ఈ యాత్రలో అనేకమంది సైక్లిస్టులు, సాహసయాత్రలు చేసేవారితో పరిచయం ఏర్పడిందని ఆశిష్ చెప్పాడు. లండన్ (యూకే) నుంచి సైకిల్ మీద 14 నెలల పాటు ప్రయాణించి భారత్ చేరుకున్న ఓ సైక్లిస్టుతో ఏర్పడ్డ పరిచయం తనను చెన్నై నుంచి లండన్‌ వరకు సైక్లింగ్ చేయాలన్న తదుపరి లక్ష్యానికి బాటలు వేసిందని చెప్పాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరడమే తన లక్ష్యమని, ఆ కల సాకారం చేసుకోడానికి ఇలాంటి సైకిల్ యాత్రలు కూడా తనకు దోహదపడతాయని చెబుతున్నాడు.

ఇష్టంలేని చదువుతో కష్టం, నష్టం
పిల్లల ఇష్టాయిష్టాలను, అభిరుచులను గుర్తించకుండా వారికి ఇష్టం లేని చదువులు చదివించాలని చూస్తే చివరకు కష్టం, నష్టమే మిగులుతాయని ఆశిష్ తల్లిదండ్రులు వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి చెబుతున్నారు. తమ కుటుంబంలోనే ఇష్టంలేని చదువు చదువుతున్న పిల్లలు పడుతున్న ఇబ్బందులను చూశామని, ఆ పరిస్థితి మరెవరికీ తలెత్తకూడదన్నదే తమ ఉద్దేశమని వారంటున్నారు. నిజానికి ఇంత చిన్న వయస్సుల్లో ఒంటరి ప్రయాణానికి పంపుతున్నప్పుడు తమ బంధుమిత్రులు చాలామంది వద్దని వారించారని, అయితే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే తెగువ, అనుభవం ఇలాంటి సాహసయాత్రలతోనే వస్తాయని తాము భావించి ప్రోత్సహించామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement