Friday, April 26, 2024

Big Story: దేశానికే ఆదర్శం తెలంగాణ పల్లెలు.. విజయవంతంగా పల్లె ప్రగతి ప్రోగ్రామ్​!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన ద్వారా దేశ వ్యాప్తంగా కేంద్రం ఇచ్చిన టాప్‌ 20 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన 19 గ్రామాలు ఉన్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. పల్లె ప్రగతి ద్వారా సాధించిన ఫలితాలను ఇతర రాష్ట్రాలకు కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ కోరింది. బహిరంగ మలవిసర్జన, ఈ – పంచాయతీ, ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లోనూ తెలంగాణ నెంబర్‌ ఒన్‌గా నిలిచింది. ప్రధానంగా గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, ప్రాథమిక మౌలిక సధుపాయాల కల్పన, మంచి జీవన పరిస్థితులను కల్పించడం వంటి లక్ష్యాల సాధనతో పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా పల్లె ప్రగతి నిర్వహించారు. తాజాగా ఈనెలలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.

ప్రతి నెలా వివిధ పనుల కోసం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.227 కోట్లను నిధులను విడుదల చేస్తోంది. 2019 నుంచి 2022 వరకు ఈ మూడేళ్ళలో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,070 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల స్వరూపమే మారిపోయింది. పల్లె ప్రగతి కార్యక్రమాలతో ప్రకృతి వనాలు, బృహుత్‌ ప్రకృతి వనాలు, సురక్షిత మంచినీటి సరఫరా, నర్సరీలు, ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాగే గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ళు కూల్చివేత, పాడుబడిన బావులను పూడ్చిపెడుతున్నారు. ఖాళీ స్థలాలలోని పిచ్చిమొక్కలను తొలగించి, అక్కడ పెద్ద మొక్కలను నాటుతున్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి రక్షిస్తున్నారు. తడి పొడి చెత్తను వేరు చేయడం, చెత్త ద్వారా వర్మీకంపోస్టు తయారీ, పొడి చెత్త కోసం దగ్గరలో ఉన్న ఏజెన్సీ ట్రెడర్స్‌ను అనుసంధానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement