Tuesday, May 7, 2024

Election | అక్టోబర్‌ 10న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 10న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వారం రోజుల క్రితం రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌పై సంకేతాలిచ్చినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 10 లేదా వారం అటుఇటుగా నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

శాసన సభను రద్దుచేసి 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినపుడు ఆ ఏడాది నవంబర్‌ నెల 10వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ దఫా ఒక నెలముందే ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించాలన్న యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తోంది. 2018 నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగా నామినేషన్ల స్వీకరణకు నవంబర్‌ 19 గడువు తేదిగా నిర్ణయించింది. నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 20వ తేదీ కాగా నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది.

డిసెంబర్‌ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు పోలింగ్‌ నిర్వహించగా నాలుగు రోజుల తర్వాత డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కింపు జరిగింది. 2018 సెప్టెంబర్‌ 6వ తేదీన భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా తొమ్మిది నెలలు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 2014లో 63 స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనతను కేసీఆర్‌ సాధించారు. రెండో దఫా ఎన్నికల్లో 88 సీట్లు సాధించి సత్తా చాటారు.

- Advertisement -

బదిలీలకు వేళాయె!

శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ.. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణా విధుల్లో ఉండే అధికారుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేయరాదని, మూడేళ్లకు మించి అక్కడే కొనసాగరాదని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా రెవెన్యూ, పోలీసు సహా ఇతర అధికారులు తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.

బదిలీలకు కసరత్తు షురూ

అధికారులు, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఆదేశాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తుకు శ్రీకారం చుట్టింది. ఈసీ మార్గదర్శకాలకు లోబడిలేని అధికారుల బదిలీలపై దృష్టి సారించింది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించే ఐఏఎస్‌ అధికారులు నలుగురిని బదిలీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కొన్ని జిల్లాల ఎస్పీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారుల బాధ్యతల్లో ఉన్న పలువురిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఇన్‌ఛార్జ్‌లు ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి అధికారులను కూడా నియమించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది అధికారులు, సిబ్బందిపై బదిలీల వేటు-పడే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో 91 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ కసరత్తు ఉన్నత స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. ఈసీ మార్గదర్శకాలకు లోబడి ఉండేలా బదిలీలు చేయడంతో పాటు మరికొంత మందిని కూడా బదిలీ చేయవచ్చని అంటున్నారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌ స్థాయిలో కూడా ఇప్పటికే కసరత్తు పూర్తైంది. ఆ జాబితాను ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. మహారాష్ట్ర పర్యటన నుంచి సీఎం కేసీఆర్‌ తిరిగి రాగానే బదిలీలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని సమాచారం. ఎన్నికల సమయం అయినందున పాలనా, రాజకీయ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని బదిలీల ప్రక్రియ పూర్తయి.. కొత్త పోస్టింగులు ఇస్తారని చర్చ జరుగుతోంది.

రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా.. మధ్యప్రదేశ్‌ గడువు జనవరి 6, మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17, ఛత్తీస్‌గడ్‌ గడువు జనవరి 3, రాజస్థాన్‌ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాల్లో.. ఎక్కువ కాలం పని చేసిన ప్రాంతాల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒకేచోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది.

సీనియర్‌ ఐఏఎస్‌లకు స్థానచలనం

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌లను బదిలీ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement