Sunday, May 19, 2024

ఠారెత్తిస్తున్న టమాట, పచ్చిమిర్చి ధరలు.. సెంచరీ దాటిన టమాట రేటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టమాట, పచ్చిమిర్చి కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. కొద్దిరోజులుగా టమాట, పచ్చిమిర్చి ధరలు అడ్డూఅదుపులేకుండా పోతున్నాయి. మిగతా కూరగాయల ధరలు రూ.60 నుంచి రూ.80 మధ్యలో ఆగినా టమాట, పచ్చిమిర్చి ధరలు మాత్రం సెంచరీ దాటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాట రూ.100 దాటింది. సఅదేవిధంగా పచ్చిమిర్చి ధర రూ.120కంటే పైకి ఎగబాకింది. రోజువారీగా చేసే ఏ కూరలోనైనా టమాట, ప చ్చిమిర్చి ఉండాల్సిందే. ఇవి రెండూ లేనిదే వంటలు సంపూర్ణం కావు. ఈ రెండు కూరగాయల ధరలు 100 దాటడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. టమాట, పచ్చిమిర్చి లేకుండానే వంటలను పూర్తి చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు కిలో కొనేవారు పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇక పేదలైతే టమాట, పచ్చిమిర్చి కొనడమే మానేశారని చెబుతున్నారు.

- Advertisement -

దేశవ్యాప్తంగా అన్ని వెజిటెబుల్‌ మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజులుగా టమాట ధరలు ఆకాశాన్నంటుండడంతో పేద, సామాన్యులు బెంబేళెత్తిపోతున్నారు. 20 రోజుల క్రితం కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.40మధ్యలో ఉండేది. కాని ఆది, సోమ వారాల్లో కిలో టమాట ధర ఏకంగా 100 దాటింది. టమాట ధర సెంచరీ కొడుతుండడంతో సామాన్యుల జేబులకు చిల్లుపడుతోంది. తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాట ఏకంగా రూ. 100 దాటింది. హోల్‌సేల్‌ మార్కెట్లో ధర పెరగడంతో రిటైల్‌ దుకాణాల్లో కిలో టమాట రూ. 80 నుంచి రూ.120 వరకు పలుకుతోంది. పచ్చిమిర్చి కిలో ధర రూ.120కిపైమాటే.

గత మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలతో కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నాయి. అనంతరం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయల దిగుబడి కూడా తగ్గిందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో టమాట, పచ్చిమిర్చి పంట సాగు లేకపోవడంతో ఏపీలోని చిత్తూరు, మదనపల్లె, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడకు చెబుతున్నారు. రాబోయే నెల రోజులపాటు టమాట పెరుగుదల ఈ విధంగానే ఉండబోతోందని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. తాజా పంట మార్కెట్‌లోకి వస్తేనే ధరల మంట నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ధరలు పెరగడంతో టమాటా, పచ్చిమిర్చిని వినియోగదారులు తక్కువగా తీసుకుంటున్నారని కూరగాయల షాపుల యజమానులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement