Sunday, April 28, 2024

అసద్ నివాసంపై రాళ్ల దాడి.. పగిలిన కిటికీ అద్దాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఢిల్లీలోని అశోక రోడ్‌లో ఉన్న ఆయన నివాసం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఓవైసీ ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వెంటనే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం అసద్ నివాసానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజిని పరిశీలించడంతో పాటు దాడి సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. ఇంట్లో పార్కింగ్ ప్రదేశంలో మూడు రాళ్లు, ఇటుక ముక్కలను పోలీసులు గమనించారు. సీసీటీవీ ఫుటేజిలో అనుమానించదగ్గ కదలికలేవీ కనిపించలేదని తెలిసింది. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాటి కారణంగా అద్దాలు ధ్వంసం అయ్యాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అసద్ మాత్రం తన నివాసంపై గతంలోనూ దాడులు జరిగాయని, రాజకీయంగా, సైద్ధాంతికంగా విబేధించే వర్గాలే ఈ దాడికి పాల్పడ్డాయని తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

పోలీసుల భద్రతా వైఫల్యం: ఖలీముల్ హఫీజ్

అసద్ నివాసంపై రాళ్ల దాడి ఘటన గురించి తెలుసుకున్న ఎంఐఎం ఢిల్లీ అధ్యక్షుడు ఖలీముల్ హఫీజ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధాని నగరంలో ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదురుగా ఉన్న అసదుద్దీన్ నివాసంపై దాడి జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సార్లు ఒవైసీ నివాసంపై దాడి జరిగిందని, వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయనన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫేస్‌బుక్‌లో కూడా ఓవైసీపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఏదైనా జరిగితే ఓవైసీ ప్రభుత్వ భద్రత తీసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని చెబుతున్నారని, నిజానికి పోలీసుల వైఫల్యం కారణంగానే ఇవి జరుగుతున్నాయని ఖలీముల్ హఫీజ్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement