Tuesday, May 14, 2024

Spl Story : మృగశిర వచ్చినా.. తగ్గని ఎండలు !

  • గ్రేటర్‌ శివారులో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • పెరిగిన విద్యుత్‌ వినియోగం
  • 81 ఎంయూలు దాటిన డిమాండ్‌
  • మే నెలను మించి జూన్‌లో ఎండల తీవ్రత, ఉక్కపోత
  • నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్న జనం

మృగశిర కార్తె వచ్చిందంటే వాతావరణం చల్లబడుతుందనేది అందరి నమ్మకం. కానీ ఈ ఏడాది మృగశిర దాటినా ఎండల తీవ్రత మరింత పెరుగుతుండడంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మే కంటే జూన్‌ నెలారంభంలోనే ఎండలు మరింత పెరగడంతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం పది గంటలకే రోడ్డెక్కాలంటే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలుదాటి పోయాయి. ఎండల తీవ్రత వల్ల మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రాకపోవడంతో చాలా వరకు రోడ్లపై రద్దీ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు వడదెబ్బతో చనిపోవడంతో మరో పది, పదిహేను రోజులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత వల్ల విద్యుత్‌ వినియోగం కూడా భారీగా పెరిగింది. గ్రేటర్‌ పరిధిలో గతంలో ఎప్పుడు లేనంతగా 81 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో రికార్డు స్థాయిలో నిలిచింది.
– ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌

జూన్‌ రెండవ వారంలోకి అడుగుపెడుతున్నప్పటికి ఎండల తీవ్రత మరింత పెరుగుతుండడంతో పాటు భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. పది గంటలకే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. జూన్‌ మాసం ఆరంభం కావడంతో నైరుతి రుతుపవనాలు వస్తాయని, దాంతో వాతావరణం చల్లబడుతుందని జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు మరింత ఆలస్యమయ్యేలా ఉందనే సమాచారం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. వేసవిలో అకాల వర్షాలు కురుస్తున్నప్పటికి వాటి ప్రభావం కనిపించడం లేదు. వర్షాలు కురుస్తున్నప్పటికి ఎండల వేడిమిని భరించలేక పోతున్నామని జనం వాపోతున్నారు. అకాల వర్షాల వల్లనే వాతావరణం మరింత వేడెక్కుతుందని నిపుణులు పేర్కోంటున్నారు. వర్షాలు రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కోంది. మే మాసంతో పోలిస్తే జూన్‌ నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం గమనార్హం.

- Advertisement -

మధ్యాహ్నం రోడ్లపై నిర్మానుష్యమే..
ఎండల తీవ్రతతో జనం బేంబేలెత్తుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. వడదెబ్బతో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం జనం రోడ్డుపైకి రాక పోవడంతో గ్రేటర్‌ పరిధిలోని ప్రధాన రహదారులపై జనం లేక నిర్మానుష్యంగా కనిపిస్తుంది.అత్యవసరమైన పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే ద్విచక్రవాహనంపై వెళ్లే వారి పరిస్థితి దారుణంగా మారింది. ఎండలకు తోడు వేడి గాలులు వస్తుండడంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరాలతో జనం సతమతమవుతున్నారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణుల హెచ్చరికలతో జనం అప్రమత్తం అవుతున్నారు. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత ఉండడంతో ఉపశమనం పొందడానికి ఏసీలు, కూలర్ల వాడకం చాలా పెరిగింది. దీనితో గ్రేటర్‌ హైదరాబాద్‌ విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పటికి హైదరాబాద్‌లో విద్యుత్‌ వినియోగం 81 మిలియన్‌ యూనిట్లకు చేరుకోవడం ఇప్పటికి ఆల్‌ టైమ్‌ రికార్డుగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement