Saturday, May 11, 2024

ఇండియాకు సావరిన్‌ ఒత్తిళ్లు తక్కువే.. సంతృప్త స్థాయిల్లో విదేశీ మారకం నిల్వలు

అమెరికాలో వేగవంతం అవుతున్న ద్రవ్య విధానం ప్రభావం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల నష్టాలను నియంత్రించేందుకు భారత్‌ వద్ద సరిపడ విదేశీ ద్రవ్యనిల్వలు ఉన్నాయని ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొంది. భారతదేశ క్రెడిట్‌ ప్రొఫైల్‌లో బయటి ఆర్థికాలు బలహీనంగా మారుతున్నాయి. అయితే విదేశీ మారకం నిల్వలు పటిష్టంగా ఉంటాయని, కరెంట్‌ ఖాతాలోటు స్థిరమైన స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్‌ 2022లో భారతదేశ దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ డిపాల్ట్‌ రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరమైన స్థాయికి సవరించింది. బిబిబి వద్ద ఐడీఆర్‌ను ధ్రువీకరించింది.

రేటింగ్‌కు పబ్లిక్‌ ఫైనాన్స్‌ కీలకమని ఫిచ్‌ తెలిపింది. బాహ్య ఫైనాన్సింగ్‌పై పరిమితంగా ఆధారపడటం వల్ల భారతదేశం అస్థిరత నుంచి సాపేక్షంగా నిరోధించబడినందున, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చని అంచనా వేసింది. జనవరి-సెప్టెంబర్‌ మధ్య కాలంలో దేశ విదేశీ కరెన్సీ నిల్వలు దాదాపు 101 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. ప్రస్తుతం 533బిలియన్‌ డాలర్ల నిల్వలున్నాయి. ఫారిన్‌ కెరెన్సీ నిల్వల తగ్గుతలపై ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నది. ఈ పరిణామాలకు వాల్యూయేషన్‌ ఎఫెక్ట్‌, పెరుగుతున్న కరెంట్‌ ఖాతా లోటు, రూపీ బలహీనతల పట్ల ఆర్‌బీఐ కొంత జోక్యాన్ని ప్రదర్శిస్తున్నది.

మూడింట రెండొంతల క్షీణతకు మూల్యాంకణ ప్రభావాలే కారణమని రిజర్వుబ్యాంకు పేర్కొంది. సెప్టెంబర్‌లో దిగుమతులకు అవసరమైన విదేశీ మారకు నిల్వలు సమృద్ధిగానే ఉన్నట్లు ఫిచ్‌ పేర్కొంది. ఇది 2013లో 6.5నెలల టేపర్‌ టాంట్రమ్‌ సమయంలో కంటే ఎక్కువేనని తెలిపింది. బాహ్య ఒత్తిళ్లను సజావుగా చేయడానికి ఈ నిల్వలను ఉపయోగించుకునే అవకాశం అధికారులకు లభిస్తుందని రేటింగ్‌ సంస్థ తెలిపింది. సరిపడా నిల్వలు రుణ చెల్లింపు సామర్థ్యానికి భరోసా ఇస్తాయి. స్వల్పకాలిక బాహ్యరుణం ప్రస్తుత నిల్వల్లో కేవలం 24శాతం మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో స్థూల బాహ్యరుణం జీడీపీలో 18.6శాతంగా ఉందని ఫిచ్‌ విశ్లేషించింది.

ఇది 2021లో బిబిబి రేటెడ్‌ సార్వభౌమ దేశాల సగటు (72శాతం)తో పోల్చితే తక్కువే. సావరిన్‌ ఎక్స్‌పోజర్‌లు చిన్నవి. కేవలం 4శాతం మాత్రమే. దేశీయ సార్వభౌమరుణం విదేశీ పెట్టుబడి దారుల హోల్డింగ్‌లు జీడీపీ మొత్తంలో 2శాతంలోపు ప్రాతినిధ్యం వహిస్తాయి. మార్చి2023తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కరెంట్‌ ఖాతాలోటు 2022 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 1.2శాతం నుంచి 3.4శాతానికి చేరుతుందని అంచనా. బలమైన దేశీయ డిమాండ్‌ పెరుగుదల, అధిక చమురు, బొగ్గు ధరల కారణంగా దిగుమతులు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement