Saturday, May 18, 2024

Delhi | నిబద్ధతతో పనిచేస్తే సమాజం గుర్తిస్తుంది.. తెలంగాణ స్టాండింగ్ కౌన్సెల్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఫలితం ఆశించకుండా నిబద్ధతతో పనిచేస్తే సమాజం గుర్తిస్తుందని ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సెల్ శ్రవణ్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయనకు ‘ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేయూ)’ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఏదీ ఆశించి చేయలేదని, ఏ పదవి కోసం ఎవరినీ అడగలేదని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ ఉద్యమంలో భాగమైనవారిని గుర్తించి, వారికి తగిన పదవులు అప్పగిస్తోందని, అందులో భాగంగానే తనకు స్టాండింగ్ కౌన్సెల్ బాధ్యతలు అప్పగించిందని తెలిపారు.

కొత్త బాధ్యతను మరింత బాధ్యతతో నిర్వర్తిస్తానని శ్రవణ్ కుమార్ అన్నారు. దశాబ్దకాలం వరకు పాత్రికేయ వృత్తిలో ఉన్న శ్రవణ్ కుమార్, 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. ఆరంభంలో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడి పర్యావరణ కేసులు వాదించే నిపుణుడైన న్యాయవాదిగా పేరుగాంచారు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఢిల్లీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులలో ప్రజా సమస్యలతో ముడిపడ్డ అనేక కేసులను ఆయన వాదించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పాత్రికేయుడిగా ఉద్యమంలో భాగమై దేశ రాజధానిలో కీలకంగా వ్యవహరించారు. ‘అడ్వొకేట్ ఆన్ రికార్డు’గా పదోన్నతి తెచ్చుకున్న శ్రవణ్ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే సుప్రీంకోర్టులో స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.

- Advertisement -

అసోసియేషన్ అధ్యక్షులు మహాత్మ కొడియార్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎండీ మదార్, కోశాధికారి ఎంవీ శివరావు, జాయింట్ సెక్రటరీలు సంజయ్ శర్మ, పవన్ కుమార్‌తో పాటు సీనియర్ పాత్రికేయులు తేలప్రోలు శ్రీనివాసరావు, స్వరూప పొట్లపల్లి, అసోసియేషన్ ఇతర సభ్యులు, మరికొందరు పాత్రికేయులు శ్రవణ్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. పాత్రికేయులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు, సుప్రీంకోర్టు న్యాయవాదులు అల్లంకి రమేశ్, పుప్పాల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని శ్రవణ్ కుమార్ గారిని శాలువాలు, బహుమతులతో సత్కరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement