Monday, May 13, 2024

Delhi | సుప్రీంలో కవితకు స్వల్ప ఊరట.. ఈడీ సమన్ల నుంచి 10 రోజుల ఉపశమనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్ల విషయంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కే. కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ విచారణ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత, తాజాగా జారీ అయిన సమన్లను సవాల్ చేస్తూ ఇంటర్‌లాక్యుటరీ అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దానిపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 26న తుది విచారణ జరుపుతామని వెల్లడించింది.

తొలుత పిటిషనర్ కవిత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి మహిళలను ఈడీ విచారణ జరిపే విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను గుర్తుచేశారు. విచారణ కోసం మహిళలను ఒత్తిడి చేయవద్దంటూ గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, తుది తీర్పు వెలువడే వరకు అవి కొనసాగుతాయని కూడా చెప్పిందని తెలిపారు. ఈడీ విచారణ తీరును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీలు ఈడీపై దాఖలు చేసిన పిటిషన్లతో పాటు జతచేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నళిని చిదంబరం విషయంలో కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు విచారణ కోసం ఒత్తిడి చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తమకు కూడా వర్తింపజేయాలంటూ కవిత తరఫు న్యాయవాది కోరారు. కస్టమ్స్ యాక్ట్ కేసులోనూ మహిళలపై కఠినంగా వ్యవహరించవద్దంటూ సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనానికి గుర్తుచేశారు. మనీలాండరింగ్ చట్టం సైతం విచారణ ఎదుర్కొనే మహిళలకు రక్షణ కల్పించాలని చెబుతోందని, బెయిల్ కోసం ఉద్దేశించిన సెక్షన్ 45లో మహిళలకు వెసులుబాటు కల్పించాలని ఉందని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి తుది తీర్పు ఇవ్వాలని అభ్యర్థించారు. ఫైనల్ హియరింగ్ కోసం తేదీని ఖరారు చేయాలని, అప్పటి వరకు ఈ సమన్లను వాయిదా వేయాల్సిందిగా ఈడీని ఆదేశించాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. ఈ దశలో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. విచారణ వాయిదా వేయాల్సిందిగా కోరారు. అప్పటికప్పుడు విచారణకు పిలవకుండా 10 రోజులు ముందే సమన్లు జారీ చేశామని, తగినంత సమయం ఇచ్చామని చెప్పారు. ఆమె (కవిత) ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణకు హాజరయ్యారని కూడా గుర్తుచేశారు.

- Advertisement -

ఇప్పుడు ఆమె బిజీగా ఉంటే మరో 10 రోజులు సమయం పొడిగిస్తామని, అంతే తప్ప సమన్లను నిరవధికంగా వాయిదా వేయడం కుదరదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి మేరకు కేసు విచారణ సెప్టెంబర్ 26కు వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. ఈ దశలో జోక్యం చేసుకున్న కవిత తరఫు న్యాయవాది అప్పటి వరకు ఈడీ సమన్లను వాయిదా వేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు.

ఆదేశాల్లో ఈ అంశాన్ని తాము రికార్డు చేయాలా లేక మీరు చెప్పినట్టు 10 రోజులు వెసులుబాటు ఇస్తారా అని ధర్మాసనం ఏఎస్జీ రాజును ప్రశ్నించింది. తాము ముందే చెప్పామని, 10 రోజులు వాయిదా వేస్తామని, ఆదేశాల్లో పేర్కొనాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అలా మొత్తంగా కవితకు ఈడీ విచారణ నుంచి 10 రోజుల విరామం లభించింది. సెప్టెంబర్ 26న జరిగే తుది విచారణ అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పు మీద తదుపరి విచారణ ఆధారపడి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement