Wednesday, May 8, 2024

రైతు బంధు దేశానికే ఆదర్శం.. ఈ పథకంతో ఇప్పటి వరకు 58,102 కోట్ల ఆర్థిక సాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద రూ.58,102 కోట్ల ఆర్థిక సాయం అందించి చేయూతనిచ్చింది. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం కూడా ఫసల్‌ భీమా యోజన పథకం ప్రారంభం చేసింది. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ రైతులకు చేయూతనిచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. రాష్ట్రంలో తొలినాళ్లో 2014లో స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7778 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 17వేల 234 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రోజంతా రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో రైతు బంధు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం కొత్తగా 3.64 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందించాలనే ఉద్ధేశ్యంతో రైతు బంధు నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఉన్నతాధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో ఇటీవల జమయ్యాయి. ఎకరాకు రూ.5వేల చొప్పున విడతల వారీగా రూ.7654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 68,94,486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించింది. రాష్ట్రంలోని 1.53 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందింది. దాదాపు 1.50 లక్షల ఎకరాల భూమి కొత్తగా రైతు బంధు జాబితాలో చేరింది. యాసంగి సీజన్‌లో పోల్చితే 3.64 లక్షల మంది రైతులకు ఈసారి కొత్తగా రైతు బంధు ఆర్థికసాయం అందించారు. గత యాసంగి వరకు రైతు బంధు కింద రూ.50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సీజన్లో జమ చేసిన రూ.7654.43 కోట్లను కలిపితే మొత్తంగా రైతు బంధు సాయం రూ.58,102 కోట్లకు చేరింది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి ప్రతి రైతుకి ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఒక్కో ఎకరానికి రూ.5వేలు, మొత్తంగా రూ.10 వేల సాయం అందిస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తొలినాళ్లలో 2018-19 బడ్జెట్‌లో రూ.12వేల కోట్లను కేటాయించింది. తర్వాత 2021 వరకు ఈ పథకం కింద రూ.50వేల కోట్లను రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద రుణాలను వడ్డీ లేకుండా సైతం ప్రభుత్వం అందిస్తోంది. 68 లక్షల మంది రైతులు ఈ పథకం కింద ప్రతి ఏడాది పెట్టుబడి సాయం పొందుతున్నారు. రాష్ట్రంలోని కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు పంట సాగు జరుగుతోంది. ఈ పంటపెట్టుబడి సాయం పథకం వల్ల 90.5 శాతానికి పైగా పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. అంతకు ముందు రైతులకు పంట సాయం లేకపోవడంతో పెట్టుబడిదారులు, దళారుల నుంచి అప్పులు తెచ్చుకునేవారు. వారు రైతులపై అధిక వడ్డీలు విధించడంతో రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునేవారు. అలాంటి పరిస్థితి ఉండకూడదనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్న ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement