Wednesday, May 8, 2024

ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు, త్వరలో అందుబాటులోకి : ఎండీ సజ్జన్నార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇకపై ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 రీజియన్లు, 97 బస్‌ డిపోలతో విస్తృత నెట్‌వర్క్‌ ఉన్న టీఎస్‌ఆర్టీసీ వినియోగదారుల చెంతకే అంటే హోమ్‌ డెలివరీ, హోం పికప్‌ సదుపాయాలను ప్రారంభించనుంది. వినియోగదారులకు ఇంటి వద్దనే కార్గో సేవలు అందించేందుకు వీలుగా మొదటి, చివరి మైల్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందుకు ఆసక్తి ఉన్న సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయమై మంగళవారం ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, ఎండీ సజ్జన్నార్‌ మాట్లాడుతూ… కార్గో, పార్సిల్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీఎస్‌ఆర్‌టీసీ కసరత్తు చేస్తోందన్నారు. వేగంగా, సురక్షితంగా, చేరువలో అనే నినాదంతో ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సేవలు తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందాయన్నారు.

ప్రజా రవాణా సేవల్లో భాగంగా నడుపుతున్న బస్సుల ద్వారా పార్సిళ్లను పాయింట్‌ టు పాయింట్‌ వరకు చేరవేయడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతోపాటు కొన్ని రీజియన్లలో మాత్రమే హోం డె లివరీ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే వినియోగదారులకు మరింత సేవలను అందించే ఉద్దేశ్యంతో జిల్లాల్లోనూ హోం పికప్‌ కార్గో సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. హోం డెలివరీ కార్గో సేవల కోసం ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. ఆయా సంస్థలు తమ ఆర్థిక సామర్థ్యంతోపాటు వ్యాపార వివరాలను టీఎస్‌ఆర్టీసీ సంస్థ మెయిల్‌కు పంపాలన్నారు. మరింత సమాచారం కోసం కార్గో, పార్సిల్‌ విభాగం అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ 9154197752 నంబరును లేదా బస్‌భవన్‌లోని 3వ అంతస్థులో సంప్రదించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement