Thursday, May 16, 2024

Delhi | అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్ధం.. ఏఐసీసీ వేదికగా ప్రకటించిన రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్)పై పోటీకి తనతో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి బలరాం నాయక్‌తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి చేశానని చెబుతున్న కేసీఆర్‌ను కొడంగల్‌లో తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరానని, ఆయన రాకపోతే కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో తాను పోటీకి సిద్ధమని చెప్పానని గుర్తుచేశారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు కేటీ రామారావు (కేటీఆర్)పై పోటీకి తానైనా, భట్టి విక్రమార్క అయినా పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

- Advertisement -

బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేసిన వినతి పత్రాల్లో మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిపారు. అందులో ఒకటి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల వ్యవహారం ఒకటని, పదవీ విరమణ పొందిన తర్వాత ఈ అధికారులంతా కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారుల పేర్లతో జాబితాను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్టు తెలిపారు.

మరోవైపు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ వంటి లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకాలను ఆపేయాల్సిందిగా తాము ఈసీని కోరలేదని రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా అంటే.. నవంబర్ 3 కంటే ముందు ఈ నగదు బదిలీ మొత్తం పూర్తిచేయాలని మాత్రమే కోరామని తెలిపారు. అయితే బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఈ పథకాలను తాము అడ్డుకుంటున్నట్టుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఈ పథకాల కింద వచ్చే సొమ్మును తాము అధికారంలోకి వచ్చాక తీసుకుంటే పెంచిన మొత్తంతో సహా అందుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో ఉన్నది బీజేపీ సర్కారే!

తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ సర్కారే అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో ఢిల్లీకి కప్పం కడుతున్నారని, అందుకే ఢిల్లీ పెద్దలు కేసీఆర్‌ జోలికి రావడం లేదని తెలిపారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తే ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ వంటి దర్యాప్తు సంస్థలను తమ పార్టీ అనుబంధ సంస్థలుగా మార్చి ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో ఆ పనిచేయడం లేదని, ఎందుకంటే అక్కడున్నది తమ ప్రభుత్వమే అన్న భావనలో బీజేపీ నాయకత్వం ఉందని రేవంత్ రెడ్డి సూత్రీకరించారు. కప్పం కడుతూ సామంత రాజులా కేసీఆర్ వ్యవహరిస్తున్నందునే ఈ మినహాయింపు లభించిందని వివరించారు.

ఇకపోతే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ వేరు కాదని, ‘చెడ్డీగ్యాంగ్’లో ఈ మూడూ భాగమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసమే ఈ పార్టీలు వివిధ ఎత్తుగడలు అమలు చేస్తున్నాయని అన్నారు. అసద్ భాయ్ – అమిత్ భాయ్ ఇద్దరూ డబులింజన్ రైలు వంటివారని, వారిని విడదీయలేమని, విడదీస్తే రెండో ఇంజిన్ పడిపోతుందని అన్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతున్న విషయం స్పష్టమైందని చెప్పిన రేవంత్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ వేర్వేరుగా పోటీ చేసినా, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎంల కూటమి ఏర్పడుతుందని అన్నారు. బీజేపీ ఏడు స్థానాల్లో, బీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో, ఏఐఎంఐఎం ఒక స్థానంలో పోటీ చేసేలా ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరిందని అన్నారు.

తిరిగి వచ్చేవారికి స్వాగతం

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీజేపీ పోరాడుతుందని భావించి భ్రమపడి కొందరు తమ పార్టీ నేతలు కాషాయతీర్థం పుచ్చుకున్నారని, ఆ పార్టీలో చేరిన తర్వాత వారికి వాస్తవం అవగతమైందని రేవంత్ రెడ్డి అన్నారు. అలా నిజం గ్రహించినవారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, వివేక్ తదితరులున్నారని, రాజగోపాల్ రెడ్డి తరహాలో తిరిగొచ్చేవారికి తాము స్వాగతం పలుకుతామని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో హంగ్ రాదు

గత 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పునే ఇచ్చారు తప్ప హంగ్ ఫలితాలు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమకు ఎంఐఎం వంటి పార్టీల మద్దతు అవసరం పడదని, స్పష్టమైన మెజారిటీతో తాము గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ మీడియాకు కూడా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement