Friday, April 26, 2024

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు విశ్రాంత అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ మృతి

కోదాడ, ప్రభన్యూస్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ విశ్రాంత చీఫ్‌ ఇంజనీర్‌ శీల బోయిన సత్యనారాయణ(86) శుక్రవారం కోదాడలోని తన స్వగృహంలో మృతి చెందారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1958-1968 వరకు సత్యనారాయణ అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలోనూ మరియు కుడి, ఎడమ కాలువల డిజైన్‌ చేయడంలోనూ, అంతేకాకుండా, నాగార్జునసాగర్‌ – హాలియా రోడ్డు నిర్మాణంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణలోని నీటిపారుదల శాఖలకు ముఖ్య సలహాదారుగా పనిచేశారని కుటు-ంబ సభ్యులు సన్నిహితులు తెలిపారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం డిజైనింగ్‌లో ముఖ్యమైన ముగ్గురు ఇంజనీర్లలో సత్యనారాయణ ఒకడిగా పనిచేసి, మీడియం నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగ విరమణ చేసినట్లు ఆయన సోదరుడు కోదాడకు చెందిన కంటి వైద్య నిపుణుడు డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఆయన మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఫోను ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. సత్యనారాయణ మృతిపట్ల కోదాడలోని పలువురు డాక్టర్లు, బంధుమిత్రులు తమ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement