Thursday, May 9, 2024

అగనంపూడి టోల్‌ప్లాజా తొలగించండి.. నితిన్ గడ్కరీకి ఎంపీ జీవీఎల్ లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని 16వ నంబర్ జాతీయ రహదారిలో అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాను తొలగించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన సోమవారం రోడ్లు, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. 20 కిలోమీటర్ల పరిధిలో స్థానిక విశాఖపట్నం నగరవాసుల నుంచి టోల్ వసూలు చేయడం ఎన్‌హెచ్‌ఏఐ విధానాన్ని ఉల్లంఘించడమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. రూ.2,500 కోట్లతో ఆనందపురం నుంచి అనకాపల్లి 51 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం పూర్తైనన తర్వాత కూడా అగనంపూడి వద్ద ఫ్లైఓవర్‌ను కొనసాగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

హైవే స్ట్రెచ్‌ను నిర్మించి, అక్కడ కొత్త టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసిన తర్వాత ఈ టోల్ ప్లాజాను తొలగిస్తామని జాతీయ రహదారుల అథారిటీ పేర్కొందని జీవీఎల్ గుర్తు చేశారు. ఆనందపురం-అనకాపల్లి బైపాస్‌ పనులు చాలా నెలల క్రితమే పూర్తయ్యాయని, ఇప్పటికే అక్కడ టోల్‌ప్లాజా ఏర్పాటు చేశారని, అగనంపూడి ఫ్లైఓవర్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా తొలగిస్తామని గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించి కాంట్రాక్టర్ ద్వారా టోల్‌గేట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అగనంపూడి టోల్‌ప్లాజా విశాఖపట్నం నగర పరిధిలోకి వస్తుందని, 20 కి.మీ పరిధిలో నివసించే ప్రజలకు టోల్ ఫీజు మినహాయించే విధానం ఇక్కడి ఫ్లైఓవర్‌ విషయంలో అమలు కావడం లేదని ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అగనంపూడి ఫ్లైఓవర్‌ను వెంటనే తొలగించాలని జీవీఎల్ నరసింహారావు  కోరారు. త్వరలోనే నితిన్ గడ్కరీని వ్యక్తిగతంగా కలిసి ఫ్లైఓవర్ తొలగింపు అంశంపై చర్చిస్తానని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టినందుకు జీవీఎల్ నరసింహారావు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖలో అభినందనలు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement