Saturday, May 25, 2024

Delhi | త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనులు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరం చుట్టూ 340 కి.మీ పొడవైన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ యుటిలిటీ ఖర్చులు రూ. 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఉదయం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి భవన్‌ను సందర్శించిన అనంతరం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) సంస్థ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు.

రీజనల్ రింగ్ రోడ్డు సహా తెలంగాణలో పలు ఇతర రోడ్డు ప్రాజెక్టుల గురించి ఎన్.హెచ్.ఏ.ఐ చైర్మన్‌తో చర్చించారు. వాటిలో నల్గొండ రింగ్ రోడ్డు (రూ. 1,000 కోట్లు), రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ రీజియన్, రూ. 4,000 కోట్ల విలువైన ఆర్మూరు – మంచిర్యాల సెక్షన్ జాతీయ రహదారి గురించి చర్చించారు. అలాగే మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు నేషనల్ హైవే 65 పై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం గురించి కూడా ఎన్.హెచ్.ఏ.ఐ చైర్మన్‌తో ఆయన చర్చించారు.

ఈ భేటీ కంటే ముందు తెలంగాణ భవన్ శబరి బ్లాక్ వద్ద మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రూ. 20 వేల కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరం చుట్టూ 340 కి.మీ మేర రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, అయితే యుటిలిటీ ఖర్చుల కింద రూ. 300 కోట్లు భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం అందుకు సమ్మతించకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎక్కడిక్కకడే ఆగిపోయిందని అన్నారు.

- Advertisement -

రీజనల్ రింగ్ రోడ్ రాష్ట్రంలో సగభాగాన్ని ఆక్రమిస్తూ తెలంగాణకే మణిహారంగా మారుతుందని, ఇంత పెద్ద రీజనల్ రింగ్ రోడ్డు దేశంలో మరెక్కడా లేదని అన్నారు. తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోరిన యుటిలిటీ ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉందని, త్వరలో తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి ఈ మేరకు లేఖ రాస్తారని ఆయన తెలిపారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూస్తామని, రూ. 60 కోట్లకు ఒక టెండర్ చొప్పున బిట్లుగా పనిని విభజించి ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement