Friday, May 3, 2024

ఐఏఎస్‌లకు కేస్‌స్టడీగా మారిన రాజన్న సిరిసిల్ల- మంత్రి కేటీఆర్

ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల.. ఇప్పుడు ఐఏఎస్‌లకు కేస్‌ స్టడీగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెరువులు బాగుచేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లా పరిస్థితి సుభిక్షితంగా మారిందన్నారు. జిల్లాలో భూగర్భ నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నీళ్లు నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఏర్పడిన రాష్ట్రాన్ని.. ఎనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.

ఉద్యమ సహచరులంతా ఒకే వేదికపై కనిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో అంబేద్కర్‌ వర్సిటీలో వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారని చెప్పారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. స్టడీ మెటీరియల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు అందించాలన్నారు. ఈ ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని విమర్శించారు.టీహబ్‌, వీహబ్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని మంత్రి తెలిపారు. అందుకే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో లక్షా 55 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 83 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement