Sunday, May 19, 2024

అయిననూ మళ్లీ రావలె.. ఈడీ ఎదుట మంగళవారం రాహుల్ హాజరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారం రోజురోజుకూ రాహుల్ గాంధీ మెడకు చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గత వారం వరుసగా మూడు రోజులు రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు, సోమవారం కూడా దాదాపు 10 గంటల పాటు విచారణ జరిపారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 4 రోజుల్లో 40 గంటల పాటు రాహుల్ గాంధీ ఈడీ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మంగళవారం కూడా మరోసారి విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం నాటి విచారణలో సోనియా గాంధీ ఆస్పత్రిని నుంచి డిశ్చార్జయ్యే సమయంలో రాహుల్ గాంధీకి అధికారులు బ్రేక్ ఇచ్చారు. అనంతరం మళ్లీ మొదలైన విచారణ రాత్రి వరకు కొనసాగింది.

ఇప్పటి వరకు జరిగిన విచారణలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టేకోవర్ చేసుకోవడం, ఆ క్రమంలో జరిగిన లావాదేవీలు, పాత అప్పులు, ఏజేఎల్ ఆస్తులు తదితర అంశాల గురించి ప్రశ్నించగా, సోమవారం నాటి విచారణలో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హవాలా మార్గాల్లో వచ్చిన రూ. 5 లక్షల సొమ్ము గురించి ప్రశ్నించినట్టు తెలిసింది. రాతపూర్వకంగానే సమాధానాలు కోరుతున్న ఈడీ అధికారులకు సమాధానమిచ్చేందుకు రాహుల్ గాంధీ ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టుగా తెలిసింది.

అందరూ ఢిల్లీకి రండి..

రోజులు గడుస్తున్న కొద్దీ సాగుతున్న ఈడీ విచారణను తీవ్రంగా వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీలో ఉన్న జాతీయస్థాయి నేతలు, ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలకు తోడుగా అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేసి చెప్పారు. ఈనెల 23 వరకు అందరూ ఢిల్లీలోనే ఉండాలని వారికి ముందే స్పష్టం చేశారు. తద్వారా రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్నంత కాలం ఢిల్లీలోనే ఉండి నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశంగా కనిపిస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement