Sunday, May 19, 2024

Delhi | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రఘువీర.. ఏపీ, తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పార్టీ అధిష్టానం పునర్వ్యవస్థీకరించింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఏఐసీసీ ఆదివారం సీడబ్య్లుసీ సభ్యుల జాబితాను విడుదల చేసింది. సీడబ్ల్యూసీలో మొత్తం ఆరుగురు తెలుగు నేతలకు చోటు లభించింది. సీడబ్ల్యూసీలో మొత్తం 39 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది ఇంచార్జులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. సీడబ్ల్యూసీలో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డికి చోటు దక్కింది.

శాశ్వత ఆహ్వానితుల జాబితాలో కొప్పుల రాజు, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు చోటు లభించింది. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఎం.ఎం. పళ్లంరాజు, వంశీచంద్ రెడ్డిలకు అవకాశం దొరికింది. గాంధీ కుటుంబంలోని ముగ్గురు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు రాజస్థాన్ అసమ్మతి నేత సచిన్ పైలట్‌, వివాదాస్పద నేత శశి థరూర్‌కు కూడా సీడబ్ల్యూసీలో చోటు దక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో గాంధీ కుటుంబం బలపరిచిన మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా పోటీ చేసిన శశిథరూర్‌కు ప్రాధాన్యత దక్కినట్టైంది.

- Advertisement -

మొత్తం 39 మంది సభ్యుల్లో 50 ఏళ్లలోపు వయసు గల వారు సచిన్ పైలట్, గౌరవ్ గగోయ్, కమలేశ్వర్ పటేల్‌ ఉన్నారు. కమిటీలో ముందు నుంచి సభ్యులుగా ఉన్న అధిర్ రంజన్ చౌదరి, ఏకే ఆంటోనీ, అంబికా సోని, దిగ్విజయ సింగ్, పి. చిదంబరం, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మను అలాగే కొనసాగిస్తున్నారు. తెలంగాణ పీసీసీ పదవి ఆశించి భంగపడిన కొందరు నేతలు కనీసం తమకు సీడబ్ల్యూసీలోనైనా చోటు దొరుకుతుందని ఆశించినా నిరాశే ఎదురైంది. మొదట్నుంచి టీపీసీసీ అధ్యక్ష పదవి మీద ఆశలు పెట్టుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా మరికొందరు నేతలు ప్రయత్నాలు ఫలించలేదు.

టీపీసీసీ సిఫారసులను కూడా పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు. దళిత, గిరిజన సామాజిక సమీకరణాల్లో భాగంగా సీతక్క, సంపత్ పేర్లను ప్రతిపాదించినప్పటికీ ఇద్దరిలో ఏ ఒక్కరికీ చోటు దక్కలేదు. తెలంగాణ విషయంలో చురుగ్గా ఉన్న నేతలను పట్టించుకోని అధిష్టానం ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డి, సుబ్బిరామిరెడ్డి, పళ్లంరాజులను సీడబ్ల్యుసీలోకి తీసుకుంది. ఇక్కడా రాష్ట్ర రాజకీయాలు, భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్న వారిని హైకమాండ్ పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల విషయంలో అధిష్టానం సమీకరణాలు ఏమై ఉంటాయనే దాని మీద సీనియర్ నేతలు రకరకాల అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement