Sunday, May 5, 2024

Siricilla – కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాట – ముష్టి ఘాతాలు…. కుర్చీలతో దాడులు

సిరిసిల్ల, ఆగస్టు 20 (ప్రభన్యూస్) : సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తెరపైకి వచ్చి పరస్పర దాడులకు దారితీసింది. ఆదివారం సాయంత్రం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదికగా ఈ రసాభాస కొనసాగింది. సిరిసిల్ల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు ఇన్ చార్జి క్రిస్టోఫర్ తిలక్, పిసిసి ఉపాధ్యాక్షులు దొమ్మాటి సాంబయ్య, కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ లు హాజరు కావాల్సి ఉంది.

అయితే ఈ ముఖ్య నేతలు రావడానికి ముందే సమావేశం జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగి పలువురు గాయాలకు గురయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ కేకే మహేందర్ రెడ్డి టికెట్ రేసులో ఉండగా కేసిఆర్ మేనల్లుడు చీటీ ఉమేష్ రావు కూడా టికెట్ ని ఆశిస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ముస్తాబాద్ కు చెందిన కొందరు యువకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే సమావేశం జరుగుతుండగానే ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తనకు తెలియకుండా పార్టీలోకి కొత్తగా కొత్తవారిని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించాడు. మరోవైపు ఫ్లెక్సీలలో నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఫోటోలు పెట్టకపోవడం మరోవైపు ఈ వర్గానికి చెందిన కార్యకర్తలు భగ్గుమన్నారు.

కాగా సమావేశంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు లేవనెత్తిన అంశంపై రసాభాసకు దారితీసింది. దీనితో నాయకుల మధ్య ఘర్షణ వరకూ వెళ్లి ఇది తారస్థాయికి చేరుకొని ఏకంగా కుర్చీలు లేపి కొట్టుకున్నారు. ఒకవైపు కేకే మహేందర్ రెడ్డి వర్గం, మరోవైపు చీటీ ఉమేష్ రావు వర్గం, ఇంకో వైపు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆయన కుమారుడు సంగీతం శ్రీనాథ్ ఘర్షణకు దిగడంతో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరు నచ్చదుపుతున్నారు తెలియక పార్టీ శ్రేణుల్లో అయోమయానికి దారి తీసింది

- Advertisement -

. ఘర్షణలో కొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణ ముగిసిన తర్వాత వేములవాడలో పార్టీ సమావేశం ముగించుకొని వచ్చిన ముఖ్య నేతలు క్రిస్టోఫర్, దొమ్మాటి సాంబయ్య, పొన్నం ప్రభాకర్ లు పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఆ సమయంలో మీడియాను లోనికి అనుమతించలేదు. అనంతరం సమావేశం ముగించుకొని వారు వెళ్ళిపోయారు. గత కొంతకాలంగా వర్గ పోరు నివరుగప్పిన నిప్పులా ఉండగా ఆదివారం నాటి సంఘటన బహిర్గతం చేసి పార్టీ నేతల చర్యలు రచ్చకు దారితీసాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement