Tuesday, May 14, 2024

బలప్రయోగాన్ని సహించం, చైనాకు క్వాడ్‌ తీవ్ర హెచ్చరిక.. ఉక్రెయిన్‌పై దాడిన ఖండించిన అగ్రనేతలు..

టోక్యో: ఇండో పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్ఛను పరిరక్షించడానికి దృఢ చిత్తంతో వ్యవహరిస్తామని క్వాడ్‌ దేశాల అగ్రనేతలు ప్రతినబూనారు. జపాన్‌లోని టోక్యోలో క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగింపు సందర్భంగా నాలుగు దేశాల అగ్ర నేతలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రాంత దేశాలన్నిటినీ కలుపుకుంటూ… ఈ ప్రాంత సుస్థిరతకు పాటుపడుతామని వారు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ఎవరు ప్రయత్నించినా సహించబోమని కూడా ఈ ప్రకటనలో క్వాడ్‌ నేతలు హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరికను చైనాను ఉద్దేశించినదేనని స్పష్టమవుతున్నది. అయితే సంయుక్త ప్రకటనలో ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు. అయినా…ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సాగిస్తున్న దుందుడుకు చర్యలను ఈ ప్రకటనలో సవివరంగా పేర్కొన్నారు.

ఒక వైపు ఈ సమావేశాలు జరుగుతుండగానే రష్యా, చైనా యుద్ధవిమానాలు జపాన్‌ సమీపంలో విన్యాసాలు చేశాయని జపాన్‌ రక్షణ మంత్రి నోబూ కిషి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రష్యా, చైనా దేశాలకు తీవ్ర నిరసనను తెలియజేసినట్లు కూడా కిషి తెలియజేశారు. అయితే, రష్యా, చైనా విమానాలు జపాన్‌ గగనతలంలోకి ఏమీ జొరబడలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. క్వాడ్‌ గ్రూప్‌లో మన దేశంతో సహ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. భాగస్వామ్య దేశాల మధ్య బంధం కాలంతో పాటు ఎలా పటిష్టమైందీ ఆ ప్రకటనలో వివరించారు. 20008లో క్వాడ్‌ గ్రూప్‌ తొలిసారి కార్యరూపం దాల్చినా..ఆ తరువాత సద్దుమణిగిందనీ, 2017లోనే దానిని పునరుద్ధరించడం జరిగిందనీ ఆ ప్రకటనలో వివరించారు.

ఈ నాలుగు దేశాల అగ్రనేతలు తొలిసారిగా నిరుడు సమావేశమయ్యారు. నేటి సమావేశం నాల్గవది. అయినా.. ఈ నేతలు ముఖుముఖి కలుసుకోవడం మాత్రం ఇది రెండోసారి. తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలలో ఎదురవుతున్న సవాళ్లను ఈ ప్రకటన అధికంగా ప్రస్తావించింది. ఈ ప్రాంతంలోని అనేక దేశాల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని పేర్కొన్నది. సౌత్‌ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా చెప్పుకుంటున్నది. ఈ ప్రాంతంలోని అనేక దీవులను చైనా తన సైనిక స్థావరాలుగా మార్చుకుంటున్నది. వందలాది పడవలతో కూడిన మారిటైమ్‌ మిలిషియాను తయారుచేస్తున్నది. ‘యథాతథ స్థితిని దెబ్బతీసేవిధంగా, వివాదాస్పద ప్రాంతాలలో సైనికీకరణ వంటి ఉద్రిక్తతలు పెంచే ఏ చర్యనైనా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం.ఏకపక్షంగా, రెచ్చగొట్టే ఏ సైనికచర్యనూ సహించబోము. ఇక్కడ కోస్ట్‌ గార్డ్‌ గస్తీ పడవలను, మారిటైమ్‌ మిలిషియా దళాలను ఉపయోగించడాన్ని ఎట్టి పరిస్థితులలో అనుమతించం. తమ పరిధిలోని సముద్ర సంపదను వెలికితీసుకోవడానికి ఇతర దేశాలకు అవరోధాలు కల్పిస్తే అంగీకరించబోము’ అంటూ తీవ్ర పదజాలంతో ఈ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఉక్రెయిన్‌ యుద్ధం పర్యవసానంగా ఉత్పన్నమైన మానవీయ పరిస్థితుల్లో తాము నిర్వహించాల్సిన బాధ్యతల గురించి కూడా ఈ నాయకులు చర్చించారు. ‘ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడాలని ఈ ప్రకటనలో పునరుద్ఘాటించారు. ఏ దేశమైనా.. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందే. ఐక్యరాజ్య సమితి నియమావళిని, ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రతలను పరిరక్షించాల్సిందే’నని అందులో పేర్కొన్నారు. ఆసియా సంక్షోభంపై కూడా వారు చర్చించారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని వారు ఖండించారు. మయన్మార్‌లో హింసకు స్వస్థి పలకాలని పిలుపు ఇచ్చారు. మహమ్మారుల కాలంలో పరస్పర సహకారం పెంచుకోవాలని, మౌలిక సదుపాయాల కల్పనలో, పర్యావరణానికి సంబంధించిన అంశాలలో చేదోడువాదోడుగా నిలవాలని కూడా ప్రతినబూనారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement