Wednesday, May 1, 2024

మళ్లి ప్రారంభం కానున్న ఫణిగిరి తవ్వకాలు.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఏఎస్‌ఐ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సమాజ హితానికి త్రిచరణాలు ప్రభోధించి మానవాళిని మంచిమార్గంలో పయనింపచేసిన బుద్ధ భగవానుని స్థూపాలకు,చైత్యాలకు తెలంగాణ సుప్రసిద్ధి చెందిందనడానికి కేంద్ర పురావస్తు శాఖ నివేదికలు అనేకం స్పష్టం చేస్తున్నాయి. కీస్తు పూర్వం నుంచి తెలంగాణ ప్రాంతాల్లో బౌద్ధం విరాజిల్లింది. నాగార్జున కొండను రాజధానిగా చేసుకుని పాలించిన ఇక్ష్వాక రాజులు, అనంతర రాజులు నిర్మించిన బౌద్ధస్థూపాలు తెలంగాణలో తవ్వినకొద్ది బయల్పడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోని ఎఎస్‌ఐ ఫణిగిరిలో చెపట్టిన తవ్వకాల్లో నాగార్జున కొండను మించిన చైత్యగృహాలయాలు, స్థూపాలు అనేకం వెలుగుచూడటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 135 కోట్ల పురావస్తు తవ్వకాలు,పురావస్తు అభివృద్ధికి నిధులు కేటాయించడంతో ఈ నిధులకు మించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేందుకు నిర్ణయించి వేసవిలో తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే 1950లో పురావస్తు పరిశోధకుడు ఖాజామహ్మద్‌ తవ్వకాలను ప్రారంభించి నిధులకొరతతో నిలిపివేశారు. అనంతరం 2001 నుంచి కొద్ది కాలం తవ్వకాలు జరిపి వాతావరణం సహకరించకపోవడంతో నిలిపి వేశారు. అయితే రాష్ట్ర పురావస్తు శాఖ డిపిఆర్‌ మేరకు కేంద్ర పురావస్తు శాఖ తవ్వకాలకు అనుమతిస్తూ నిధులు కేటాయించడంతో తిరిగి వేసవిలో ఫణిగిరి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.

బ్రిటిష్‌ కాలంలో జైళ్లుగా, నిజాంల కాలంలో ఫణిగిరి చైత్యగహలను కఠిన కారాగారాలుగా వనియోగించుకున్న చరిత్ర ఉంది. అయితే ఈ ప్రాంతాన్ని నిశిధంగా పరిశీలించి తవ్వకాలు చేపట్టినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నయి. అయితే 1950లో జరిపిన తవ్వకాల్లో క్రీస్తుపూర్వ నాటి ఆధారాలు లభ్యం అవడంతో కేంద్ర పురావస్తు శాఖ ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి తవ్వకాలు చేపట్టింది. ఫణిగిరితవ్వకాల్లో ఉత్తరభారతదేశాన్ని దక్షిణ పథంతో కలిపే ఒకప్పటి జాతీయరహదారిపై క్రీస్తుపూర్వం విస్తరించిన బౌద్ధ మత ఆనవాళ్లు విస్తారంగా లభ్యం అవుతున్నాయి. హీనాయాన, మహాయాన బౌద్ధ శాఖలకు నిలయమై సుప్రసిద్ధ బౌద్ధాచార్యుల ఆవాసాలు తవ్వకాల్లో వెలుగుచూశాయి. అలాగే మహాస్తూపం, చైత్యగృహాలు,ఉద్దేశిక స్తూపాలు బుద్ధుని లోహ ప్రతిమలు, బౌద్దునిచిహ్నాలు, జాతక కథల శిల్పాలు, సిద్ధార్థ గౌతముని జీవితఘట్టాలుమలిచిన అపురూపశిల్పాలు, శాతవాహన రాజుల క్షేత్రాలు, ఇక్ష్వాకుల నాణేలు, మట్టి, సున్నపు బొమ్మలు, పూసలు లభించాయి. రోమన్‌ చక్రవర్తులు ఫణిగిరిని సందర్శించినట్లు అనేక ఆధారాలు లభించాయి. ఇందులో ప్రధానంగా 7వ రోమన్‌ చక్రవర్తి కాలం నాటి 7.3 గ్రాముల బంగారు నాణం బయటపడటంతో ఆప్రాంతంలో తవ్వకాలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ నిర్ణయించింది.

రోమన్‌ కు తెలంగాణకు ఉన్న సంబంధాలు ఈ నాణలతో తెలిస్తుందని పురావస్తు శాఖ తెలిపింది. అయితే క్రీస్తు పూర్వం నుంచి తెలంగాణ ప్రాంతాల్లో పట్టువస్త్రాలు, ముడిపత్తి, బంగారు ఆభరణాలు రోమన్‌ తదితర దేశాలను ఎగుమతి అయినట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం వేసవిలో తవ్వకాలు జరిపితే ఇక్ష్వాక రాజులు తెలంగాణలోని ఏప్రాంతాల్లో ఆధిపత్యం వహించారు. ఆనాటి వ్యవసాయరంగం, సాగునీటి రంగం ప్రాభల్యం బహిర్గతం అయ్యే అవకాశాలున్నాయి. ఫణిగిరి సమీపంలోని చెరువు సహజంగా ఏర్పడింది కాదనీ ఈ చెరువును ఇక్ష్వాక రాజులు తవ్వించారనే ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో చెరువుల తవ్వకాలను ఇక్ష్వాకులు ప్రారంభించినట్లు పురావస్తు శాఖ అంచెనావేస్తుంది. క్రీస్తుశకం 220 నుంచి క్రీ.శ. 295 వరకు ఇక్ష్వాకులు పాలించిన చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో శాసన సంబంధమైన ఆధారాలు ఇక్కడ కొన్ని లభించాయి. ఇక్ష్వాక రాజు వీర పురుషదత్తుడు ఫణిగిరిని 11 సంవత్సరాలు పాలించినట్లు ఇటీవల శాసనాధారం లభించింది.

- Advertisement -

ఫణిగిరి తవ్వకాలు అద్భుతాలు ఆవిష్కరిస్తాయి..

అమరావతి శిల్పకళ కు మించిన శిల్పకళ క్షేత్రం ఫణిగరి అని సుప్రసిద్ధ పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. అయితే ఫణిగిరితో పాటుగా పరిసరాల్లోని గాజులబండ, తిరుమలగిరి, వర్థమానకోట తదితర బౌద్ధ క్షేత్ర ఆధారాలున్న ప్రాంతాల్లో తవ్వకాలు చేపడితే తెలంగాణలో ఇక్ష్వాక రాజుల చరిత్ర, తెలంగాణ ప్రాంతాలకు విదేశాలకు ఉన్నసంబంధాలు, వర్తక, వాణిజ్య అంశాలు వెలుగుచూస్తాయని చెప్పారు. రోమన్‌ సామ్రాజ్యంతో ఆనాడు తెలంగాణ ప్రాంతాలు చేసిన వర్థకవాణిజ్య అంశాలు తెలుస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement