Sunday, May 5, 2024

పేదలకు మరింత చేరువగా ప్రభుత్వ వైద్యం.. బస్తీ దవాఖానాలలో 134 ఉచిత పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర్రంలో ప్రభుత్వ వైద్యం పేదలకు మరింత చేరువ కానుంది. కార్పొరేటు ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా పేదల చెంతకే బస్తీ దవాఖానాల పేరుతో ఉచిత వైద్యాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం వచ్చే నెల నుంచి మరిన్ని సౌకర్యాలు కల్పించనుంది. ప్రస్తుతం బస్తీ దవాఖానాలలో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజేస్తున్నది. దీంతో పాటు 57 రకాల డయాగ్నస్టిక్స్‌ సేవలు కూడా అందిస్తున్నారు. రక్త, మూత్ర, లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ పరీక్షలతో పాటు స్కానింగ్‌ తదితర 57 రకాల పరీక్షలకు సంబంధించి బస్తీ దవాఖానాలలో శాంపిల్స్‌ సేకరించి ఆ మరుసటి రోజు రోగులకే నేరుగా పంపిస్తున్నారు. బస్తీ దవాఖానాలను ఆరేళ్ల క్రితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.48 లక్షల మందికి లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు, 1.8 లక్షల మందికి థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలు సైతం నిర్వహించారు.

- Advertisement -

కాగా, రాష్ట్ర్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఉస్మానియా, గాంధీ. నీలోఫర్‌ ఆసుపత్రులకు ప్రతీ రోజూ రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఆసుపత్రులకు ప్రతీ రోజూ దాదాపు 4 నుంచి 5 వేల మంది రోగులు వివిధ వైద్య చికిత్సల నిమిత్తం వస్తుంటారు. దీంతో ఈ రెండు ఆసుపత్రులపై అధిక భారం పడుతున్నది. ఈ ఆసుపత్రులపై పడుతున్న అధిక భారాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రస్తుతం 345 బస్తీ దవాఖానాలను నిర్వహిస్తున్నది. ఈ దవాఖానాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో వచ్చే మార్చి నెలలో మరో 151 ఆసుపత్రులను ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న 345, వచ్చే నెలలో ప్రారంభం కానున్న 151 బస్తీ దవాఖానాలను కలిపి అన్నింటిలో 134 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.

మరోవైపు, కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌ పథకాన్ని ఏప్రిల్‌ నెల నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా కామారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆ తరువాత ఈ పథకాన్ని క్రమంగా రాష్ట్ర్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఇప్పటికే 1540 ఆశా వర్కర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఇకపై ఆదివారం కూడా బస్తీ దవాఖానాలలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వ వైద్యులను షిప్టుల ప్రకారం విధులు కేటాయించి ఎంత మంది వస్తే అంతమంది రోగులకు ఉచిత వైద్యం అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement