Thursday, April 25, 2024

ఆర్థికశాఖ అనుమతిచ్చి 8 నెలలు! ఇంతవరకూ వెలువడని గురుకుల నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గురుకుల నోటిఫికేషన్‌ మరింత ఆలస్యం కానున్నది. ఆర్థిక శాఖ అనుమతిచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంత వరకూ నోటిఫికేషన్‌ వేయడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) తాత్సారం చేస్తుందనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ మొత్తం 11,005 పోస్టులకు రెండు దఫాలుగా అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత వివిధ కేటగిరీల్లోని 9,096 గురులకుల ఉద్యోగాల భర్తీకి 2022 జూన్‌ 17న ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. తర్వాత ఈ ఏడాది 2023 జనవరిలో 2009 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. మొత్తంగా 11,105 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే 9096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి దాదాపు ఎమనిమిది నుంచి తొమ్మిది నెలలు కావొస్తున్నా నోటిఫికేషన్‌ విడుదల చేయడంలో గురుకుల బోర్డు కాలయాపన చేస్తుందనే విమర్శలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకూ నోటిఫికేషన్‌ జారీ విషయంలో ఇదిగో అదిగో అంటూ చెప్పుకొచ్చిన బోర్డు.. తీరా ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎన్నికలను సాకుగా చూపి కోడ్‌ అమల్లో ఉందంటూ దాటవేస్తున్నారు.

మొదట్లో 317జీవో నేపథ్యంలో గురుకుల ఉద్యోగుల బదిలీ కాలేదని నోటిఫికేషన్‌కు బ్రేక్‌ పడింది. అవి పూర్తి చేసిన తర్వాత గురుకుల సొసైటీలు ఇంకా రోస్టర్‌ జాబితా ఇవ్వలేదంటూ కొన్ని రోజుల వరకు నియామపక ప్రక్రియను ఆపారు. ప్రస్తుతం అన్ని సంక్షేమ శాఖల నుంచి రోస్టర్‌ జాబితా అందినా ఎన్నికల కోడ్‌ అడ్డు వచ్చిందని అధికారులు బదులిస్తున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈలెక్క ప్రకారం చూసుకుంటే గురుకుల నోటిఫికేషన్‌ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాతే గురుకుల నోటిఫికేషన్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించాలనే డిమాండ్‌!..

గ్రూప్‌-1, 2, 3, 4తో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి టీఎస్‌పీఎస్‌సీ వెంట వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే మరో పక్క గురుకుల బోర్డు మాత్రం నియామక ప్రక్రియను చేపట్టడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో గరుకుల పోస్టుల నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించాలని తెలంగాణ డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీలో భాగంగా టీఎస్‌పీఎస్‌సీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఉద్యోగ ప్రకటనలను ఇప్పటికే వెలువరించాయి. ఈ మూడు నియామక బోర్డుల పరిధిలో దాదాపు 45 వేల నుంచి 50 వేల వరకు వివిధ ప్రకటనలు జారీ చేశాయి. కానీ గురుకుల బోర్డు మాత్రం సుమారు 12 వేల వరకు ఉన్న పోస్టులకు ఇప్పటికీ ప్రకటన జారీ చేయలేదు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన గురుకుల ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్నిరోజులేమో రోస్టర్‌ జాబితా తదితర కారణాలు చూపిస్తూ కాలయాపన చేసిన బోర్డు ఇప్పుడేమో ఎన్నికల కోడ్‌ అంటూ నోటిఫికేషన్‌ జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement