Monday, May 6, 2024

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. రామగుండం ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, చెరువులు పొంగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు కురిసిన వర్షాలతో కుంటలు, చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నా.. మరో మూడు రోజులు భారీ వర్షాల కురిస్తే వరినారు నీట మునిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, అంతటా జలకళ సంతరించుకుంది. జలపాతాల్లో నీటి ప్రవాహం పెరుగగా, ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతున్నది. దీంతో ఆయా చోట్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. మధ్యాహ్నం 35వేల క్యూసెక్కులు ఉండగా సాయంత్రానికి ఇన్‌ఫ్లో 40వేల క్యూసెక్కులు దాటింది. పెద్దపల్లి జిల్లా పార్వతి బ్యారేజ్‌ 4 గేట్లు- ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి వదిలారు. ఇన్‌ప్ల 3 వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ప్ల 3 వేల క్యూసెక్కులు నమోదైంది. బ్యారేజ్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 8.83 టీ-ఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ 4.325 టీ-ఎంసీలు ఉన్నట్లు- అధికారులు తెలిపారు. మంథని నియోజవర్గం పరిధిలోని మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్‌కు 97 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 35 గేట్లు ఎత్తి 93 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

జగిత్యాలలోని మాతా శిశు కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా నానిపోయిన పీఓపీ సీలింగ్‌ పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని హాస్పిటల్‌ సిబ్బంది తెలిపారు. కరీంనగర్‌లోని అనేక కాలనీల్లో జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ముకరంపుర, జ్యోతినగర్‌, భగత్‌ నగర్‌, కట్టరాంపూర్‌ ఏరియా, విద్యానగర్‌, మంకమ్మతోట, పోలీస్‌ టైనింగ్‌ కాలేజీ ఏరియాల్లో భారీగా వరద నీరు చేరింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏరియాలో చాలా చోట్ల డ్రైనేజీలు పూర్తి కాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి మార్గంలో రాజీవ్‌ రహదారిపై ఇరుకుల్ల వద్ద ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. వర్షానికి డాంబరు పెచ్చులు ఊడి ఐరన్‌ రాడ్స్‌ బయటకు రావడంతో బ్రిడ్జి కూలుతుందనే భయంతో ప్రయాణికులు బ్రిడ్జి దాటేందుకు భయపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్లలోని పాత బస్టాండ్‌తో పాటు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వేములవాడ హన్మజిపేట దగ్గర నక్కవాగు పొంగిపొర్లుతోంది. భారీ వర్షాలతో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శనివారం అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 4.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలో 4.36, కరీంనగర్‌ జిల్లాలో 3.06, పెద్దపల్లి జిల్లాలో 2.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో 5.18, కొత్తపల్లిలో 4.98, కరీంనగర్‌ పట్టణంలో 3.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement