Friday, May 3, 2024

Delhi | సవాళ్ల నడుమ ఆపరేషన్ కావేరి.. భారత్ సాయం కోరుతున్న ఇతర దేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంతర్యుద్ధంతో రణరంగంగా మారిన సూడాన్ నుంచి భారతీయులను తరలించే ‘ఆపరేషన్ కావేరి’ శరవేగంగా సాగుతోంది. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నా సరే సూడాన్‌లోని రెండు గ్రూపులతో భారత దౌత్యవేత్తలు మంతనాలు సాగిస్తూ తరలిస్తున్న భారతీయులకు ముప్పు తలెత్తకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. తుపాకీ కాల్పులతో దద్దరిల్లుతున్న సూడాన్ రాజధాని ఖార్తుమ్ నుంచి సుమారు 900 కి.మీ రోడ్డు మార్గంలో భారతీయులను తరలించి సముద్రతీర పట్టణం పోర్ట్ సూడాన్‌కు చేర్చడం అత్యంత సాహసోపేతంగా మారింది. యుద్ధం కారణంగా డీజిల్, పెట్రోల్ కొరత ప్రయాణ ఏర్పాట్లకు ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికే గురితప్పిన తుపాకీ తూటా ఒక భారతీయుడి ప్రాణాలు బలితీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి భారతీయుణ్ణి సురక్షితంగా మాతృభూమికి చేర్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ భారత ప్రతిష్టను అంతర్జాతీయ చిత్రపటంపై మరింత ఇనుమడింపజేస్తోంది. భారత్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా తమ దేశ పౌరులను కూడా తీసుకురావాలంటూ ఇతర దేశాలు కోరుతున్నాయి.

అయితే సౌదీ అరేబియా ప్రభుత్వ సహకారం, మద్ధతుతో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో తొలుత భారతీయులకు ప్రాధాన్యతనిస్తూ.. వీలైనంత మేర సాయం కోరిన ఇతర దేశాలకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. గురువారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్ర ‘ఆపరేషన్ కావేరి’పై ప్రత్యేకంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అనేకాంశాలు పంచుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి సూడాన్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని యుద్ధ వాతావరణం నెలకొందని అన్నారు. ఆధిపత్యం కోసం తలపడుతున్న సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్ఏఎఫ్), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని, చాలాచోట్ల సీజ్ ఫైర్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు.

ఈ స్థితిలో అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ చేపట్టిందని, అయితే ఆ దేశంలో చిక్కుకున్న భారతీయుల ఎంత అన్న విషయంపై తొలుత స్పష్టత లేదని చెప్పారు. ఎప్పుడైతే రెండు గ్రూపుల మధ్య పోరు మొదలైందో, ఆ వెంటనే సూడాన్‌లోని భారతీయులకు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తూ తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా చెప్పామని, 3,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మరో 300 మంది భారత మూలాలున్న ప్రజలు కూడా ఖార్తుమ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారని వెల్లడించారు. ఆ దేశంలో 400 ఏళ్ల క్రితమే భారత్ నుంచి వెళ్లి స్థిరపడ్డ ప్రజలు 900 మందికి పైగా ఉన్నారని, వారు నేటికీ భారత్‌తో విడదీయలేని అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. భారతీయులతో పాటు భారత్ చేరుకోవాలని కోరుకుంటున్న భారత మూలాలున్న ప్రజలను కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు.

- Advertisement -

ఈ మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఢిల్లీలో విదేశాంగ శాఖ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అలాగే సూడాన్‌లోని ఖార్తుమ్, పోర్ట్ సూడాన్ నగరాల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు ట్రాన్సిట్ పాయింట్‌లా ఉన్న సౌదీ అరేబియాలోని జెడ్డాలో భారత ప్రభుత్వం ఒక క్యాంప్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సూడాన్ నుంచి తొలుత జెడ్డాకు తరలిస్తున్నామని చెప్పారు. సూడాన్ దక్షిణ భాగంలో అశాంతి నెలకొందని, అందుకే అక్కడున్నవారందరినీ ఉత్తరాన సముద్ర తీరాన ఉన్న పోర్ట్ సూడాన్‌కు తరలిస్తున్నామని చెప్పారు. పోర్ట్ సూడాన్‌ నుంచి రెండు సీ-130 వాయుసేన విమానాలు, మూడు నావికాదళ నౌకలు INS సుమేధ, INS తేగ్, INS తర్కష్ ద్వారా భారతీయులను జెడ్డా (సౌదీ అరేబియా)కు తరలించి తాత్కాలికంగా అక్కడ భోజన, వసతి సదుపాయాలు కల్పించామని చెప్పారు.

జెడ్డా నుంచి భారత్‌లోని ఢిల్లీ, ముంబై నగరాలకు ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నామని వివరించారు. భారత్ చేరుకున్న తర్వాత వారిని తమ తమ స్వస్థలాలకు పంపేందుకు ఢిల్లీలోని ఆయా రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు సూచనలు జారీ చేశామని చెప్పారు. దాదాపు 2,000 మందిని అశాంతి నెలకొన్న ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించగలిగామని, అందులో సగం మంది ఇప్పటికే భారత్ చేరుకున్నారని వెల్లడించారు. అక్కడ చిక్కుకున్న ప్రతి భారతీయుడినీ సురక్షితంగా తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. భారతీయ మూలాలున్న 900 మందికి కూడా సహాయం అందజేస్తున్నామని తెలిపారు. సూడాన్ పరిస్థితిపై ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపామని, ఈ క్రమంలో సౌదీ అరేబియా ప్రభుత్వం అందజేస్తున్న సహకారం, మద్ధతు మరువలేనిదని ఆయన వ్యాఖ్యానించారు.

నీళ్ళతోనే ప్రాణాలు నిలబెట్టుకున్నాం: విష్ణువర్థన్

సూడాన్ నుంచి భారత్‌కు తరలించినవారిలో ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు చెందిన విష్ణువర్థన్ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ప్రాణాలతో అక్కణ్ణుంచి బయటపడతానని అనుకోలేదని, పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ అక్కడక్కడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. ప్రైవేట్ వాహనాల్లో తాము పోర్ట్ సూడాన్ చేరుకున్నామని, ఎక్కడా ఆహారం దొరక్కపోవడంతో నీళ్లు తాగి ప్రాణాలు నిలుపుకున్నామని చెప్పారు. పోర్ట్ సూడాన్ నుంచి భారత ప్రభుత్వం తమను జెడ్డాకు తరలించిందని, అక్కణ్ణుంచి భారత్ చేరుకోగలిగానని హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు విష్ణువర్థన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి స్వస్థలానికి చేరుకునే ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీలో తెలంగాణ హెల్ప్ డెస్క్

సూడాన్ నుంచి భారత్‌కు తరలిస్తున్నవారిలో తెలంగాణవాసులను గుర్తించి వారికి సహాయం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చినవారిలో తెలంగాణవాసులను గుర్తించి, వారికి తాత్కాలికంగా భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. అనంతరం స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement