Monday, April 29, 2024

అంబానీ వారసులకు నో శాలరీలు – బోర్డు సమావేశాలకు హాజరైతే ఫీజు

న్యూఢిల్లి : రిలయన్స్‌ బోర్డులోకి వచ్చిన ముఖేష్‌ అంబానీ వారసులు అకాష్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, ఈశాకు ఎలాంటి వేతనాలు ఇండవు. వీరిని బోర్డులో నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమించారు. వీరు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు ఫీజులు మాత్రం చెల్లిస్తారు. ఈ వివరాలను కంపెనీ షేర్‌ హోల్డర్లకు పంపించిన తీర్మానంలో వెల్లడించింది.

రిలయన్స్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ తన వారసత్వ ప్రణాళికలో భాగంగా తన ముగ్గురు పిల్లలను గత సంవత్సరం కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సంవత్సరం ఈ ముగ్గురినీ బోర్డులోకి తీసుకున్నారు. గతంలో ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె కూడా వేతనం తీసుకోకుండా బోర్డు సమావేశాలకు హాజరైతే ఫీజుతో పాటు, కమిషన్‌ పొందినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది..

వారసత్వ ప్రణాళికను ప్రకటించినప్పటికీ మరో ఐదు సంవత్సరాలు తానే ఛైర్మన్‌గా కొనసాగనున్నట్లు ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. 2020-21 నుంచి ముఖేష్‌ అంబానీ ఎలాంటి వార్షిక వేతనం, లాభం ఆధారిత కమిషన్‌ తీసుకోవడంలేదు. మరో ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధానంలో కొనసాగుతానని ఆయన బోర్డుకు తెలిపారు. 2008-09 సంవత్సరం నుంచి 2019-20 వరకు ఆయన తన వార్షిక వేతనాన్ని 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.వారసత్వ ప్రణాళికలో భాగంగా గత సంవత్సరం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ బాధ్యతలను ఆకాష్‌ అంబానీకి అప్పగించారు. ఈశా అంబానీ రిలయన్స్‌ రిటైల్‌ బాధ్యతలను తీసుకున్నారు. అనంత్‌ అంబానీ నూతన ఇంధన రంగ బిజినెస్‌ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. గత నెలలో జరిగిన బోర్డు జనరల్‌ బాడీ సమావేశంలో నీతా అంబానీ బోర్డు డైరెక్టర్‌గా వైదొలిగారు. అదే సమావేశంలో అంబానీ తన ముగ్గురు పిల్లలను బోర్డులోకి తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement