Thursday, May 2, 2024

గుజరాత్‌లో జలవిలయం.. తొమ్మిది మంది మృతి

గుజరాత్‌ రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గత రెండు రోజుల్లో తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్‌యీవోసీ) శనివారం తెలిపింది. నగరాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై వరద పరిస్థితిని తలపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలైన కచ్‌, జామ్‌ నగర్‌, జునాగఢ్‌, నవ్‌సరి జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన బలగం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన బలగానికి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) చెందిన బృందాలు మోహరించాయి. ఎస్‌యీవోసీ ఇచ్చిన డేటా ప్రకారం గడిచిన 30 గంటల్లో రాష్ట్రంలో 37 తాలూకాలు 100 మి.మీ.లకు పైగా వర్షపాతాన్ని నమోదు చేసుకున్నాయి. గత 24 గంటల్లో జునాగఢ్‌ జిల్లాలోని విసవ్‌దర్‌ తాలూకా 398 మి.మీ.ల అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసుకుంది.

- Advertisement -

వర్షాలకు తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో జామ్‌నగర్‌ జిల్లాలోని జామ్‌నగర్‌ తాలూకా(269 మి.మీ.లు), కప్రదాలోని వల్‌సద్‌ (247 మి.మీ.లు), కచ్‌లోని అంజర్‌(239 మి.మీ.లు), నవ్‌సరిలోని ఖేర్‌గామ్‌(22 మి.మీ.లు) ఉన్నాయి. సౌరాష్ట్ర-కచ్‌, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టుప్రాంతాలు జలమయమైపోయాయి. గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అహ్మదాబాద్‌ నగరంలో సైతం అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కచ్‌ జిల్లాలో గాంధీధామ్‌ రైల్వే స్టేషన్‌ జలమయమైపోయింది. జునాగఢ్‌, జామ్‌నగర్‌, కచ్‌, వల్‌సద్‌, నవ్‌సరి, మెహ్‌సనా, సూరత్‌ జిల్లాల్లో అనేక గ్రామాలు, పట్టణాలను వరదనీటిలో మునిగిపోయాయని అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్‌ అధికారులతో గాంధీనగర్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా సహాయక, పునరావాస చర్యలపై దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశించారు. బాధిత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే బుధవారం ఉదయం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement