Friday, May 3, 2024

జూన్‌లో పెరిగిన ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు

దేశీయంగా ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) హోల్‌సేల్‌ అమ్మకాలు జూన్‌లో 1.9 శాతం పెరిగాయి. జూన్‌లో మొత్తం 3,27,700 వాహనాల అమ్మకాలు జరిగాయి. ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో కంపెనీలు ప్రధానంగా వడ్డీరేట్లు పె రగడం, వర్షాలు సరిగా పడకపోవడం వంటి రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు మారుతీ సుజుకీ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవా అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ రెండు సవాళ్లు అధిగమించడం కఠిన పరీక్ష కానుందన్నారు.

జూన్‌లో మారుతీ సుజుకీ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 5.77 శాతం పెరిగి 1,39,648 యూనిట్లగా నమోదైనట్లు ఆయన తెలిపారు. మారుతీ సుజుకీ మినహా కార్ల తయారీ కంపెనీల అమ్మకాలు జూన్‌ నెలలో 2.1 శాతం తగ్గాయని, దీని వల్ల మొత్తం పరిశ్రమ అమ్మకాలు కేవలం 1.9 శాతంగా నమోదైనట్లు ఆయన చెప్పారు. మారుతీ సుజుకీ కంపెనీ ఉత్పత్తిని 10 రోజుల పాటు నిలిపివేసనప్పటికీ అమ్మకాలు మాత్రం పెరిగాయని చెప్పారు. గత సంవత్సరం జూన్‌లో మొత్తం ప్యాసింజర్‌ వాహనాల హోల్‌సేల్‌ అమ్మకాలు 3,21,600 యూనిట్లుగా ఉన్నాయని ఇప్పటి వరకు జూన్‌ అమ్మకాల్లో ఇదే అత్యధికమని చెప్పారు.

- Advertisement -

2023-24 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ చిప్‌ సరఫరాలు తగినంతగా మెరుగుపడలేదని, ఇది రెండో త్రైమాసికం నాటికి కుదటపడే అవకాశం ఉందన్నారు. జులై 1 నాటికి డీలర్ల ఉన్న మొత్తం అన్ని కంపెనీల వాహనాల స్టాక్‌ 2,61,000 యూనిట్లుగా ఉన్నాయని తెలిపారు. సాధారణంగా డీలర్స్‌ వద్ద 24-25 రోజుల వరకు సరిపోను స్టాక్‌ ఉంటుదని చెప్పారు. కొన్ని మోడల్స్‌ల ఇది 40-45 రోజుల వరకు ఉందన్నారు. బాగా డిమాండ్‌ ఉన్న మోడల్స్‌లో మాత్రం ఇది 1-2 రోజుల వరకు ఉన్నట్లు చెప్పారు. హ్యుండాయ్‌ కార్ల అమ్మకాలు 2.04 శాతం పెరిగి 50,001 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

కంపెనీకి చెందిన వెర్నా, క్రెటా, టక్సన్‌ మోడల్స్‌ ఆయా సెగ్మెంట్స్‌లో 2023 మొదటి ఆరు నెలల కాలంలో అగ్రస్థానానికి చేరుకుంటాయని చెప్పారు. కియా మోటార్స్‌ అమ్మకాలు 19.28 శాతం తగ్గి 19,391 యూనిట్లుగా ఉన్నాయి. మరింత మెరుగుపరిచిన సెల్టాస్‌ మోడల్‌ను ఈ వారంలోనే మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నామని, దీంతో కంపెనీ కార్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు కియా ఇండియా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఇండియా హెడ్‌ హరిదీప్‌ సింగ్‌ బ్రార్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement