Friday, May 17, 2024

Education | డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో అత్యధికంగా భర్తీ అయిన సీట్లు అవే.. జాబ్‌ కోర్సుల‌కే డిమాండ్‌ ఎక్కువ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గత కొన్నేళ్లుగా కామర్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో అత్యధికంగా కామర్స్‌ సీట్లే భర్తీ అవుతున్నాయి. లైఫ్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులు సెకండ్‌ ప్లేస్‌కు పడిపోయాయి. ఒకప్పుడు సైన్స్‌కు యమక్రేజ్‌ ఉండేది. అలాంటిదిప్పుడు సైన్స్‌కు నై…కామర్స్‌కే జై అని విద్యార్థులు అంటున్నారు. జూన్‌ 16న, 30న కేటాయించిన దోస్త్‌ మొదటి, రెండో విడత సీట్లలో ఇదే స్పష్టమైంది. గత రెండేళ్లుగా కామర్స్‌వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఈ కోర్సు చేసిన దాదాపు 60 శాతం వరకు విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో ఈ విద్యాసంవత్సరంలోనూ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు తీసుకుంటున్నవారిలో అత్యధికంగా కామర్స్‌ కోర్సునే ఎంచుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరానికి మొదటి, రెండో విడతలో కలిపి మొత్తం 1,22,487 డిగ్రీ సీట్లు భర్తీ అయ్యియి.

అయితే ఇందులో మొదటి విడతలో అన్ని బ్రాంచీలు కలిపి 73,220 కాగా, రెండో విడతలో 49,267 సీట్లు ఉన్నాయి. అందులోనూ కోర్సుల వారీగా చూసుకుంటే మొదటి విడతలో కామర్స్‌ కోర్సును ఎంచుకున్న వారు 33,251 ఉంటే, రెండో విడతలో కేవలం కామర్స్‌ కోర్సు సీట్లు పొందిన వారే 21,255 మంది ఉన్నారు. అంటే మొత్తం 54,506 కామర్స్‌ సీట్లు భర్తీ అయ్యాయి. గతేడాది 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 2,10,970 డిగ్రీ సీట్లుంటే అందులో 87,470 మంది విద్యార్థులు కామర్స్‌ కోర్సుల్లోనే చేరారు. అంటే 40 శాతంపైగా విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తికాగా, మూడో విడత ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 20న మూడో విడత సీట్లను కేటాయించనున్నారు. మూడో విడతలోనూ కామర్స్‌ వైపే విద్యార్థులు అత్యధికంగా మొగ్గు చూపుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొని కోర్సులను మార్చుకుంటారు.

సైన్స్‌కు నై….

డిగ్రీ కోర్సుల ఎంపికలో మొదటి స్థానంలో కామర్స్‌ కోర్సు ఉంటే రెండో స్థానంలో లైఫ్‌ సైన్స్‌ కోర్సు, మూడో స్థానంలో ఫిజికల్‌ సైన్స్‌ కోర్సు, నాల్గో స్థానంలో ఆర్ట్స్‌ కోర్సులున్నాయి. మొదటి విడత దోస్త్‌ అడ్మిషన్లలో కామర్స్‌లో విద్యార్థులకు 33,251 సీట్లు కేటాయించగా, లైఫ్‌ సైన్సెస్‌లో 16,434 మంది, ఫిజికల్‌ సైన్సెస్‌లో 13,468, ఆర్ట్స్‌లో 7,771 మంది సీట్లు పొందారు. ఇక రెండో విడతలోనూ కామర్స్‌లో 21,255 మందికాగా, లైఫ్‌ సైన్సెస్‌లో 11,944 మంది, ఫిజికల్‌ సైన్సెస్‌లో 9,076 మంది, ఆర్ట్స్‌లో 6307 మంది సీట్లు పొందారు. మిగతా కోర్సుల్లో ఇంకా చాలా తక్కువ మంది సీట్లు పొందారు. కామర్స్‌ కోర్సుల్లో కంప్యూటర్స్‌, ఆనర్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంతి కొత్త సబ్జెక్టులను చేర్చారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో కామర్స్‌ నేపథ్యం ఉన్న సిబ్బందికి డిమాండ్‌ పెరిగింది. గత ఆరేళ్ల క్రితం సైన్స్‌ డిగ్రీ కోర్సుల్లో 46 శాతం విద్యార్థులు చేరితే ప్రస్తుతం 36 శాతమే చేరుతున్నారు. 2017-18లో బీకాంలో 80,776 మంది విద్యార్థులు చేరితే, 2022-23కు వచ్చే సరికి ఆ సంఖ్య 87,480కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement