Sunday, May 19, 2024

లుసేన్‌ డైమండ్‌ లీగ్ టైటిల్‌ విజేత నీరజ్‌ చోప్రా

భారత ఏస్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లుసేన్‌ డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 87.66 మీటర్ల దూరం త్రో తో అతడు విజేతగా నిలిచాడు. మే నెలలో దోహా డైమండ్‌ లీగ్‌ను గెలుచుకున్న తర్వాత, గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ట్రాక్‌పైకి వచ్చిన నీరజ్‌, ప్రారంభంలో తేలిపోయినట్లు కనిపించాడు. మొదటి ప్రయత్నంలో కాస్తంత వెనుకబడ్డాడు. జర్మనీకి చెందిన జూలియన్‌ వెబర్‌ 86.20 మీటర్ల త్రో తో ముందంజలో ఉన్నాడు. కాగా, రెండవ ప్రయత్నంలో 83.52 మీటర్ల మార్కును సాధించిన చోప్రా అతికష్టంగా మూడవ స్థానానికి చేరుకున్నాడు.

- Advertisement -

ఇక్కడ మూడవ ప్రయత్నంలో 85.02 మీటర్లను అందుకున్నాడు. వెబర్‌ 86.20 మీటర్లతో జోరు పెంచడంతో నీరజ్‌ రెండవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక నాల్గవ రౌండ్‌లో నీరజ్‌ చోప్రా త్రో చెల్లకపోయినా, అతను రెండవ స్థానం నిలబెట్టుకున్నాడు. ఐదవ ప్రయత్నంలో చోప్రా 87.66 మీటర్ల దూరాన్ని అధిగమించి అనూహ్యంగా మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఆపై చివరి ప్రయత్నంలో భారత స్టార్‌ ప్లేయర్‌ 84.15 మీటర్లు విసిరి, జర్మనీ ప్లేయర్‌ వెబర్‌ను రెండవ స్థానానికి నెట్టేశాడు. టైటిల్‌ విజేత అయ్యాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్‌ వెడ్లెజ్‌ మూడవ స్థానంలో నిలిచాడు. లుసేన్‌ డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ను గెలుచుకున్న చోప్రాకు ప్రధాని మోడీ, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement