Wednesday, May 15, 2024

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 30 మంది: లోకేష్

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చనిపోలేదని, దయలేని జగన్ ప్రభుత్వమే చంపేసిందని ఆరోపించారు. ఈ ఘటనలో 11 మంది కాదు 30 మంది మరణించారని రుయా ఆసుపత్రి ముందు నిరసన తెలుపుతున్న ఓ ప్రత్యక్షసాక్షి చెబుతున్నారని లోకేష్ వెల్లడించారు.

“ఐదు నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనేది అబద్ధం… 11 మందే చనిపోయారనేది అంతకంటే పెద్ద అబద్ధం. అధికారులు వచ్చి మా ముందు మాట్లాడాలి అంటూ బాధితులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు దొంగ మాటలు, దొంగ లెక్కలు మాని వాస్తవాలు బయటపెట్టాలి” అని లోకేష్ డిమాండ్ చేశారు. మీడియాపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులతో వాస్తవాలు దాగవని తెలిపారు. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారని, ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారని ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని పక్కనబెట్టి మానవత్వంతో ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయినవారిని ప్రభుత్వ హత్యలుగా భావించి తక్షణమే వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement