Sunday, May 19, 2024

వలసబాటలో 6,500 మంది మిలియనీర్లు

మన దేశం నుంచి మిలయనీర్ల వలసలు కొనసాగుతున్నాయి. 2023లో ఇలా మన దేశం నుంచి 6,500 మంది వరకు మిలియనీర్లు వలస పోవచ్చని అంచనా వేశారు. 2022లో దేశం నుంచి వెళ్లిపోయిన 7,500 మంది కుబేరులతో పోల్చితే 2023లో ఈ సంఖ్య తగ్గనుందని అంచనా వేశారు. 10 లక్షల డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నవారిని మిలియనీర్లుగా భావిస్తారు. ధనికుల వలసల విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది.

2022లో చైనా నుంచి 10,800 మంది మిలియనీర్లు వలసపోతే, 2023లో ఈ సంఖ్య 13,500 మంది వరకు ఉంటుందని అంచనా వేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రిటన్‌, రష్యా, బ్రెజిల్‌, హంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా, మెక్సికో, సౌత్‌ ఆఫ్రికా, జపాన్‌, వియత్నాం, నైజిరియా దేశాలు ఎక్కువ మంది మిలియనీర్లను కోల్పోనున్నాయని హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రిపోర్టు పేర్కొంది.

అదే సమయంలో ఆస్ట్రేలియా, యూనైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌(యూఏఈ), సింగపూర్‌, అమెరికా, స్విట్జర్లాంట్‌, కెనడా, గ్రీస్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, న్యూజిల్యాండ్‌, ఇటలీ దేశాలు గత సంవత్సరం కంటే ఎక్కువ మంది మిలియనీర్లను స్వాగతం పలకనున్నాయని నివేదిక తెలిపింది.

వలసలు ఎక్కడికి…

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భారీగా వలసలు పోతున్న ధనవంతులు ఎక్కువగా ఆస్ట్రేలియాలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పాయింట్ల ఆధారంగా ధనవంతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సంపదతో పాటు, వృత్తిపరమైన క్వాలిఫికేషన్లు ఉన్నవారికి ఎ క్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇలాంటి వారిలో ఎక్కువగా అకౌంటెంట్లు, డాక్టర్లు, ఇం జినీర్లు, హైటెక్‌ ప్రొఫెషనల్స్‌, లాయర్లు అగ్రస్థానంలో ఉన్నారు.

- Advertisement -

ఆస్ట్రేలియాలో ఉన్న వాతావరణం, బీచ్‌లు, అందమైన ప్రకృతి అందాలు, భద్రత, రక్షణ, హెల్త్‌కేర్‌ సిస్టమ్‌, నాణ్యమైన జీవన విధానం, విద్యా అవకాశాలు, ఆకర్షిణీయమైన పన్నుల విధానం, ఆర్ధిక వ్యవస్థ వంటి అంశాలు వలస వస్తున్న అపరకుబేరులను అమితంగా ఆకర్షిస్తున్నాయని నివేదిక తెలిపింది. పేద, మధ్య తరహా దేశాల నుంచే కాకుండా ధనవంతమైన దేశాల నుంచి కూడా ఆస్ట్రేలియాకు వలస వచ్చేందుకు వీరు మొగ్గు చూపుతున్నారు.

చైనా, ఇండియా తరువాత మూడో స్థానంలో ఉన్న బ్రిటన్‌ నుంచి 3,200 మంది, రష్యా నుంచి 3,000 మంది, బ్రెజిల్‌ నుంచి 1,200 మంది వలస బాట పట్టనున్నారు. వలస వస్తున్న కుబేరులను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 2023లో ఈ దేశానికి 5,200 మంది వరకు అపరకుబేరులు వలస వస్తారని ఈ నివేదిక తెలిపింది. యూఏఈ 4,500 మందిని ఆకర్షించనుంది. సింగపూర్‌ 3,200 మందిని, అమెరికా 2,100 మందిని, స్విట్జర్లాండ్‌ 1,800 మందిని ఆకర్షించనున్నాయి.

యూఏఈ అత్యంత సురక్షితమైన స్వర్గం లాంటిదని ధనవంతులు భావిస్తున్నారు. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ, అతి తక్కువ పన్నులు, హెల్త్‌కేర్‌ సిస్టమ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగం, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, లగ్జరీ హబ్‌గా ఉండటం వంటి కారణాలు వీరిని ఆకర్షిస్తున్నాయి. ఆరు సంవత్సరాల క్రితం వరకు ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులను ఆకర్షించిన బ్రిటన్‌లో పరిస్థితి రివర్స్‌ అయింది. ప్రస్తుతం ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలోనే ధనవంతులు వలసబాట పట్టారు.

ఈ ఆరు సంవత్సరాల్లో బ్రిటన్‌ నుంచి 12,500 మంది ధనవంతులు వలసవెళ్లారు. 2023లో ఈ సంఖ్య 3,200 వరకు ఉంటుందని నివేదిక అంచనా వేసింది. రాజకీయంగా సుస్థిరంగా ఉండటం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛ, సురక్షితమైన ప్రాంతం, లగ్జరీ లైఫ్‌ లీడ్‌ చేసే అవకాశాలు వంటి వాటి ఆధారంగానే ఎక్కువ మంది ధనవంతులు వలసబాటు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement