Sunday, December 10, 2023

Delhi | బీసీ బిల్లు పెట్టాలి.. రాజ్యాధికారంలో వాటాతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం ఆఘ-మేఘాలపై చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు (బీసీ) కోసం బిల్లు పెట్టమంటే మీనమేషాలు లెక్కిస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, డా. ఎన్. మారేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీలు వీ. హనుమంత రావు, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా బర్రెలు, గొర్రెలు, పందులు, పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని, బీసీలను శాశ్వత బిచ్చగాళ్లుగా మార్చుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ రచన సమయంలోనే బి.సిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా కులతత్వం కనీస స్థాయికి చేరి, సమాజంలో సమానత్వం ఏర్పడేదని అన్నారు.

- Advertisement -
   

ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచివేస్తూ వచ్చారని ఆరోపించారు. రాజకీయ రంగంలో  బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటివల సేకరించిన గణాంకాల ద్వార తేలిందని గుర్తుచేశారు. 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుంచి బీసీలకు కనీస ప్రాతినిథ్యం లేదని, ఒక్క ఎంపీ కూడా లేరని తెలిపారు.

తెలంగాణ లో 119 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మాత్రమే బీసీలున్నారని తెలిపారు. రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉండగా 104కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదని అన్నారు. అందుకే పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీ జనాభా ప్రాతిపదికన 27 శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement