Wednesday, May 1, 2024

గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవ‌లందించండి… మెడికోస్ కి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచ‌న

మహబూబ్ నగర్, ఆగస్ట్ 28 (ప్రభ న్యూస్): ప్రభుత్వ వైద కళాశాలలో ఎంబిబిఎస్ విద్యనభ్యసించిన ప్రతి విద్యార్థి గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన ఎంబిబిఎస్ విద్యార్థుల 2 వ స్నాతకోత్సవ కార్యక్రమానికి (2017 వ బ్యాచ్) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ వృత్తి దేవుడిచ్చిన గోప్పవరమని, దేవుని తర్వాత ప్రాణాలు కాపాడేది డాక్టర్లని, అందువల్ల నిస్వార్ధంగా సేవ చేయాలని, ముఖ్యంగా రాష్ట్రంలో నిరుపేదలకు ,గ్రామీణ ప్రాంతాలలోని వారికి వైద్య సేవలు అందించడానికి వైద్య విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివి వైద్య డిగ్రీ పొందిన ప్రతి ఒక్కరు ఎంబిబిఎస్ తో సరిపెట్టుకోకుండా, పీజీ ,సూపర్ స్పెషాలిటీ వంటి ఉన్నత చదువులు చదవాలని, అలాంటి చదువులకు అవకాశాలను మహబూబ్ నగర్లోనే కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవడం వల్లనే మహబూబ్ నగర్ లాంటి జిల్లాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు అయ్యాయని, ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల అని ,మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలకు మంచి చరిత్ర ఉందని, ఉస్మానియా, గాంధీ తర్వాత అత్యంత పోటీ ఉన్న మెడికల్ కళాశాల మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల అని అన్నారు. మహబూబ్నగర్ కు మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత, నర్సింగ్ కళాశాల తీసుకువచ్చామని, 500 కోట్ల రూపాయలతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలోనే పూర్తికానున్నదని తెలిపారు. ప్రభుత్వం వైద్య విద్యార్థులపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, విద్యార్థులు లక్ష్యాన్ని గొప్పగా ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధన కృషి చేయాలని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాను మెడికల్ టూరిజం గా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో ఎయిర్ పోర్ట్ నుండి మహబూబ్ నగర్ కు సాధ్యమైనంత త్వరగా వచ్చేలా షాద్ నగర్ వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో ట్రైన్ ను మహబూబ్ నగర్ వరకు పొదగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి కోటి రూపాయలను వారం రోజుల్లో మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాక ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియం నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని, సాధ్యమైనంత త్వరగా దానిని మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్య విద్య పట్టాలను బహూకరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్ ,ప్రభుత్వ ప్రధానాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, ప్రిన్సిపల్ అకాడమిక్ డాక్టర్ నవ కల్యాణి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ నావల్ కిషోర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి ప్రసాదరావు, డాక్టర్ విజయ ఎల్దండి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement