Wednesday, May 8, 2024

Delhi | ఢిల్లీలో బీసీల భారీ ప్రదర్శన, బీసీ బిల్లుకు డిమాండ్.. మద్దతు తెలిపిన ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీసీ బిల్లు సాధన కోసం ఉద్యమం ఉద్ధృతమైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే లక్ష్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్ని పార్టీల మద్దతు కూడగడుతోంది. వెనుకబడిన వర్గాల వారికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సంఘం కోరింది. అలాగే కేంద్రంలో బీసీలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు.

వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు ఈ నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి వందలాది మంది వివిధ బీసీ సంఘాలు, అనుబంధ సంఘాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. అంతకుముందు పార్లమెంట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు.

బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా 75 ఏళ్లుగా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జెండాలు మోయడం, జిందాబాద్ కొట్టడానికే బీసీలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతం పెంచాలని, త్వరలో జరపబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రీమిలేయర్ తొలగించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, బీసీ సంఘం ఢిల్లీ ఇంఛార్జి కర్రి వేణుమాధవ్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement