Thursday, May 16, 2024

Delhi | హస్తినలో లోకేశ్ సత్యమేవ జయతే దీక్ష.. దీక్షలో పాల్గొన్న రఘురామ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సోమవారం ఢిల్లీలో గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని లోఢి ఎస్టేట్‌లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో ఉదయం గం. 10.00 నుంచి సాయంత్రం గం. 5.00 వరకు చేపట్టిన నిరాహార దీక్షలో లోకేశ్‌తో పాటు పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ (నాని), కే. రామ్మోహన్ నాయుడుతో పాటు వైఎస్సార్సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు, ఇతర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.

ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతూ కొందరు పాల్గొన్నారు. చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేశ్.. మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమకు సానుకూల ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారని లోకేశ్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2.15 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 80 వేల మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు. చంద్రబాబు కృషి కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని అన్నారు. చంద్రబాబుపై దొంగకేసు బనాయించి 24 రోజులుగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

45 సంవత్సరాలు రాష్ట్రం కోసం, దేశం కోసం చంద్రబాబు నాయుడు పనిచేశారని, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను అభివృద్ధి చేసింది ఆయనేనని అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, అందులో భాగంగా సత్యమేవ జయతే దీక్షలో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందని ప్రజలు భావిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు బెయిల్ వస్తుందని తెలిసి మరో మూడు కేసులు సిద్ధం చేశారని లోకేశ్ ఆరోపించారు. తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని మంత్రులు అంటున్నారని, తప్పు చేయని చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలేవీ తన శాఖకు సంబంధం లేనివని తెలిపారు. మంగళవారం నాటి కోర్టు నిర్ణయాన్ని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు.

కేవలం రాజకీయ కక్షసాధింపు కోసం చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. చివరకు విజిల్ వేసినందుకు కూడా కేసులు పెడుతున్నారని, ఢిల్లీలో గంట కొట్టిన తనను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇండి కూటమి, ఎన్డీఏ అని కాదు, చంద్రబాబు అంటే తెలిసినవారంతా ఆయన అరెస్టు సరికాదని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు అంటూ తనకు నోటీసులు ఇచ్చారని లోకేశ్ అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించారు. గత 8 ఏళ్లుగా తన కుటుంబ ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నామని, తనకు సబంధం లేని విషయాలపై కేసులు పెడుతున్నారని నారా లోకేశ్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement