Friday, April 26, 2024

లేబర్‌ కావలెను, నత్తనడకన నిర్మాణ రంగం.. ఇతర రాష్టాల వలస కార్మికులే దిక్కు..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: హైదరాబాద్‌ నిర్మాణరంగంలో దాదాపు 4.5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 3లక్షల మంది వరకు కూలీలు కాగా, 1.5 లక్షల మంది నైపుణ్య కార్మికులు. ఇందులో 60శాతానికి పైగా కార్మికులు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో విస్తృతమైన అవకాశాలు పెరగడంతో నగరానికి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వేగంగా అభివృద్ది చెందుతున్న నగర అవసరాలకు తగ్గట్లుగా నిర్మాణరంగం మరింత విస్తరిస్తోంది. రియల్టర్లే అని కాకుండా, స్వంత ఇళ్ల నిర్మాణాలు, సర్కార్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై కూడా లేబర్‌ కొరత ప్రభావం పడింది. గతంలో నగరంలో ప్రతిఏటా దాదాపు 25నుంచి 30వేల వరకు ప్లాట్ల నిర్మాణం జరిగేది. గడిచిన ఏడాది కాలంనుంచి నగరంలో దాదాపు 50వేల వరకు ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ రేష్యుయోకు తగ్గట్టుగా కార్మికులు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు గంప గుత్తన ఇరత రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి వారికి పనిచేసే సైట్‌లోనే వసతి కల్పిస్తున్నారు. అయితే చిన్నా చితక బిల్డర్లకు లేబర్‌ కొరత తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో శ్రీకాకుళం, ఒంగోలు, విజయనగరం, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి నగరానికి నిర్మాణ రంగ కార్మికులు వలస వచ్చేవారు. గడిచిన మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీరి రాక సగానికిపైగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కార్పెంటర్లు, మేస్త్రీలు ఇతర లేబర్‌గా పనిచేయడానికి యువత ఇష్ట పడకపోవడం, వేతన అసమానతలు, కఠినమైన పని విధానం తదితర కారణాల వల్ల ఆంధ్రా నుంచి నిర్మాణరంగ కార్మికులు నగరానికి రావడం తగ్గినట్లు భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో నగరంలో నిర్మాణరంగ కార్మికుల కొరత మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆగిన డబుల్‌ ఇళ్లు..

నిర్మాణ రంగ కార్మికుల కొరత డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై కూడా పడింది. గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పలు ప్రాజెక్ట్లులు కార్మికులు దొరకక ఆగినట్లు తెలుస్తోంది. నగరంలో మొత్తం 49ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 20ప్రాంతాల్లో చేపట్టిన పనులు పూర్తి కాగా 11 ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్ట్‌ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మరో 7 ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇచ్చిన కూలీకి లేబర్‌ రాకపోవడం, ఇతర ప్రాంతాల్లో తగినంత పని దొరకడం తదితర కారణాల వల్ల లేబర్‌ దొరకడం లేదని తెలుస్తోంది.

కొలిక్కిరాని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌..

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణరంగంలో కార్మికుల కొరతను నివారించేందుకు స్థానిక యువతను వినియోగించాలని సర్కార్‌ గత కొన్నేండ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, కామారెడ్డి, తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిర్మాణరంగ కార్మికులుగా లక్షలాది మంది ముంబాయి, గల్ఫ్‌ దేశాలకు వలస పోతున్నారు. వీరి వలసలను ఆపి హైదరాబాద్‌లో వారికి నిర్మాణరంగంలో ఆధునిక శిక్షణ అందించేకు క్రెడాయి తెలంగాణ, క్రెడాయి హైదరాబాద్‌ తదితర రియల్టర్‌ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మద్య జరిగిన క్రెడాయి హైదరాబాద్‌ ప్రాపర్టీ షో సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఒక ప్రకటన కూడా చేశారు. అయినా ఆ ప్రాజెక్ట్‌ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement