Tuesday, May 14, 2024

TS | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. “మేక కసాయిని ఎలా నమ్మిందో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేశారని” కేటీఆర్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన అనంతరం తొలిసారి రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

అవాస్తవిక వాగ్దానాలు చేసి కేసీఆర్‌ను ఓడించారని.. హామీలు అమలు చేయలేమని తెలిసే గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పారు. మేక కసాయిని ఎలా నమ్మిందో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు 39 స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ప్రతిపక్ష హోదాను ఇచ్చారని చెప్పారు. హామీల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిందని చెప్పారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఊరుకోబోమన్నారు. యాసంగి పంటకు బోనస్ ఇచ్చే జీవోను ఎన్నికల కోడ్‌కు ముందే తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500 పెన్షన్లు, రైతులకు రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుంగిన మూడు మేడిగడ్డ పిల్లర్లను బాగుచేయిస్తే రైతులకు సాగు నీరు వచ్చేదని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఓటమిని గుర్తిస్తూ గతంలో ఉన్న చేదును మరిచి ముందుకు సాగాలని కార్యకర్తలను కేటీఆర్ కోరారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నేతృత్వంలో జిల్లాలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement