Tuesday, May 14, 2024

Big Story | ఏపీ లోక్‌సభ బరిలో బీఆర్​ఎస్​.. పోటీకి సై అంటున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (లోక్‌సభ) ఆంధ్రప్రదేశ్‌లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి (భారాస) నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ చీఫ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహం రచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా), తెలుగుదేశం, జనసేనలు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయని, ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న భారాస వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బరిలోకి దిగి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వెళ్లి మంగళవారం బాగా పొద్దుపోయాక హైదరాబాద్‌ తిరిగి వచ్చిన భారాస చీఫ్‌ కేసీఆర్‌ జాతీయ స్థాయిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పాట్నాలో ఇటీ-వల జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల పర్యటన తదితర అంశాలపై ఆయన బుధవారం ప్రగతిభవన్‌లో తనను కలిసిన కొంతమంది పార్టీ కీలక నేతలు, ముఖ్యులతో సమావేశమై చర్చించినట్టు సమాచారం. రెండు రోజుల పర్యటనలో మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడంపై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతగా ప్రజల నుంచి స్పందన వస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు.

- Advertisement -

మహారాష్ట్రలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీల పాలనతో ప్రజలు విసిగివేసారిపోయారని, ప్రత్యామ్నాయ పార్టీ కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని, అక్కడ భారాస బరిలో దిగితే తిరుగులేని విజయం నమోదు చేయవచ్చన్న ధీమాను కేసీఆర్‌ వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం కష్టించి పనిచేస్తే అక్కడి ప్రజలు పట్టం కడతారని అన్నట్టు సమాచారం. ప్రజల సంక్షేమం ఏ మాత్రం పట్టని పార్టీలను తిరస్కరించేందుకు మహారాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు భారాస బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్‌ పేర్కొన్నట్టు- ప్రచారం జరుగుతోంది.

నాందేడ్‌, ఔరంగాబాద్‌, నాగ్‌పూర్‌లలో కన్నా షోలాపూర్‌ ప్రాంతంలో ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికి జేజేలు కొట్టారని, అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటు-న్నారన్న విషయం వారు చూపిన ఆదరణను బట్టే తెలుస్తోందని చెప్పినట్టు సమాచారం. తాను పాల్గొన్న బహిరంగ సభకు తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చి తాను చెప్పిన అన్ని అంశాలు శ్రద్ధగా ఆలకించారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను కలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించినట్టు- తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌లోనూ పర్యటించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం పర్యటన ఖరారు చేయాలని ఆయన పార్టీ ముఖ్య నేతలను కోరినట్టు- చెబుతున్నారు.

ఏపీలో లోక్‌సభ బరిలో….?

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా లోక్‌సభకు భారాస అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. విశాఖ ఉక్కు సమస్యతో పాటు విభజన హామీలు, రాజధాని సమస్యలు, పోలవరం పూర్తి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్టీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం, జనసేనలు భాజపాకు వంత పాడుతున్నాయని, ఈ మూడు పార్టీలు నరేంద్ర మోడీ, అమిత్‌ షా కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

ఏపీలో భాజాపా సహా మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారాసకు మద్దతు ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్టు- సమాచారం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్ర జరుగుతున్నా అధికార పార్టీతో సహా మిగతా పార్టీలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని, దీనికి తోడు విభజన అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, రాజధాని విషయంలోనూ స్పష్టత లేక ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటిని పరిష్కరించే బాధ్యత భారాస తీసుకుంటు-ందని, అందుకే తమకు పట్టం కట్టాలని ఏపీ ప్రజలను కోరాలని నిర్ణయించారు.

త్వరలో ఏపీకి కేసీఆర్‌

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే లోపే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు- సమాచారం. పర్యటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ భారాస అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, ఇతరులతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని ప్రతిపాదించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నడుమ తొలి సభను ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలలో దశల వారీగా సభలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై సమాలోచనలు జరిపినట్టు చెబుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలున్న ఏపీలో ప్రణాళికాబద్దంగా రంగంలోకి దిగితే వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవచ్చన్న ధీమాతో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement