Wednesday, May 15, 2024

సుప్రీం పీఠంపై తెలుగు తేజం..48వ సీజేఐగా ప్రమాణం

భారత న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించారు జస్టిస్ ఎన్​.వి రమణ. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్​.వి. రమణతో ప్రమాణం చేయించారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ ఎన్.వి. రమణ కీర్తికెక్కారు. గతంలో రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తమ పదవీ విరమణకు నెలరోజులముందే తదుపరి సీజేఐ పేరును.. కేంద్రానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేరును.. మార్చి 24న జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. సీజేఐ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. కేంద్ర హోంశాఖకు పంపింది. అక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరగా.. రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ.. భారత 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణను నియమిస్తూ ఈనెల 6న ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ ఆయన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్‌ ఎన్‌.వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న సాధారణ వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి గణపతిరావు, సరోజినిదేవీ దంపతులకు జన్మించిన జస్టిస్‌ రమణ స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. 1966లో జస్టిస్‌ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టగా.. ఆ తరువాత ఇన్నేళ్లకు జస్టిస్‌ రమణ మళ్లీ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవిని చేపడుతున్న తెలుగు వ్యక్తిగా ఖ్యాతి గడించారు. జస్టిస్‌ కోకా సుబ్బారావు న్యాయవాద కుటుంబంలో పుట్టి పెరిగి ఆ రంగంలో అత్యున్నత స్థానానికి చేరితే, జస్టిస్‌ రమణ సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి సర్వోన్నత పీఠాన్ని అధిరోహించబోతున్నారు. పొన్నవరంలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. తర్వాత కంచికచర్లలో విద్యాభ్యాసం సాగించారు.

అమరావతి ఆర్‌వీవీఎస్‌ కాలేజీ నుంచి బీఎస్సీ డిగ్రీ, 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని న్యాయవ్యవస్థలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పురోగమించారు. 2000 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. తర్వాత అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఏడేళ్లుగా సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైన తీర్పులు వెలువరించారు. సుప్రీంకోర్టులో గత ఏడేళ్లలో ఏటా 2వేల వరకు కేసులను విచారించారు. వేల సంఖ్యలో ఉత్తర్వులు జారీచేశారు. 156 కీలకమైన తీర్పులు ఇచ్చారు. కాగా, సీజేఐగా నియమితులైన జస్టిస్‌ రమణకు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, వివిధ పక్షాల నేతలు, ఎంపీలు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement