Saturday, April 27, 2024

జియోకు కొత్తగా 30.5 లక్షల యూజర్లు

రిలయన్స్‌ జియోకు మార్చి నెలలో అదనంగా 30.5 లక్షల మంది యూజర్లు చేరారు. ఫిబ్రవ రి నెలలోనూ జియోకు అత్యధికంగా వినియోగదారులు జతఅయ్యారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం మార్చి నెలలో వోడాఫోన్‌ ఐడియా 12.12 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. భారతీ ఎయిర్‌టెల్‌కు అదనంగా 10.37 లక్షల మంది యూజర్లు చేరారు. దీంతో ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరిలో 36.98 కోట్ల ఉంటే, మార్చి నాటికి 37.09 కోట్లు పెరిగింది. రిలయన్స్‌ జియోకు 30.5 లక్షల మంది కొత్తగా యాడ్‌ కావడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 43 కోట్లుకు చేరింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 42.71 కోట్లుగా ఉంది. ఫిబ్రవరిలో రిలయన్స్‌ జియోకు కొత్తగా 10 లక్షల మంది, ఎయిర్‌టెల్‌కు 9.82 లక్షల మంది వినియోగదారులు వచ్చారు. భారీగా యూజర్ల సంఖ్య తగ్గడంతో మార్చి నాటికి వోడాఫోన్‌ ఐడియా యూజర్ల సంఖ్య 23.67 కోట్లుగా ఉంది.

అన్ని టెలికం కంపెనీల బ్రాడ్‌బాండ్‌ వినియోగదారులకు చూసుకుంటే మొత్తంగా ఈ సంఖ్య మార్చిలో 0.86 శాతం పెరిగింది. మార్చి చివరి నాటికి బ్రాడ్‌బాండ్‌ వినియోగదారుల సంఖ్య 846.57 మిలియన్లుగా ఉంది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 839.33 మిలియన్లు గా ఉంది. బ్రాడ్‌బాండ్‌ సేవలు అందిస్తున్న ప్రధానమైన 5 సంస్థలు మొత్తం మార్కెట్‌లో 98.37 శాతం వాటా కలిగి ఉన్నాయని ట్రాయ్‌ తెలిపింది. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ యూజర్లు 43.85 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగదారులు 24.19 కోట్లు, వోడాఫోన్‌ ఐడియా కు 12.48 కోట్ల మంది బ్రాడ్‌బాండ్‌ వినియోగదారులు ఉన్నారు. దేశం మొత్తం టెలిఫోన్‌ వినియోగదారుల సంఖ్య 117.2 కోట్లుగా ఉందని ట్రాయ్‌ తెలిపింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో వారి సంఖ్య 65.3 కోట్లగానూ, గ్రామీణ ప్రాంతాల వారి సంఖ్య 51.8 కోట్లగా ఉంది. మొత్తంగా దేశంలో టెలి సాంద్రత 84.51 శాతంగా ఉందని ట్రాయ్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement