Thursday, May 2, 2024

Big story | పెద్ద రాష్ట్రాల్లోకి బీఆర్ఎస్.. నాలుగు స్టేట్స్‌పై నజర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీఆర్ ఎస్‌ జాతీయ పార్టీగా నిలదొక్కుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. అన్ని రాష్ట్రాల్లో విస్తరించేలా వ్యూమాలను అధినేత కేసీఆర్‌ సిద్ధం చేశారు. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర పైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు కనిపించినా చాప కింద నీరులా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలనే సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 15 పెద్ద రాష్ట్రాలు దేశంలో ఉండగా వాటినే లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. మొత్తం నాలుగు కొత్త రాష్ట్రాల్లోకి త్వరలోనే ఎంటర్‌ కాబోతున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే పార్టీ క్షేత్ర స్థాయి నుంచి బలపడిందో.. అలాంటి వ్యూహాలనే ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. గ్రామాల్లో భారాస బలపడితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని బలంగా నమ్మే కేసీఆర్‌ ఆ దిశగానే ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని పేరొందిన నేతలు, రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే వారిని కారు ఎక్కించే విధంగా చర్చలు జరుపుతున్నారు. హిందీ బెల్ట్‌ రాష్ట్రాలే టార్గెట్‌గా భారాస విస్తరించబోతుంది.

- Advertisement -

మరాఠా ఊపుతో పొరుగు రాష్ట్రంలోకి

మొదట తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి భారాస ఎంటర్‌ అయ్యింది. అక్కడ ప్రజల్లో స్పందన, ఇతర పార్టీల నుంచి చేరికలు జోరు అందుకోవడంతో అదే ఊపుతో పక్కన ఉన్న మరో రాష్ట్రంపై కన్నేసింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒక్కటైన మధ్యప్రదేశ్‌లోకి భారాస అడుగు పెట్టబోతుంది. ఆ రాష్ట్రంలోనూ మహారాష్ట్ర తరహా రాజకీయాలను ప్రారంభించబోతుంది. ఇప్పటికే కొంత మంది చేరారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెెట్టితే దాన్ని కుట్రలతో పడగొట్టి సర్కార్‌ను బీజేపీ చేజిక్కించుకుందన్న భావన అక్కడి ప్రజల్లో వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్‌, బీజేపీతో విసుగొందిన ప్రజలు మరో పార్టీ కోసం ఎదురు చూస్తున్నారన్న ఆలోచనలో భారాస ఉంది. అక్కడ ఇంకో పార్టీకి స్కోప్‌ ఉందన్న ధీమాతో మధ్యప్రదేశ్‌లో పాగా వేసేందుకు వ్యూహాలను సిద్ధం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలోని సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే భారాసతో టచ్‌లోకి వచ్చారు. త్వరలోనే పెద్ద ఎత్తున మధ్యప్రదేశ్‌ నుంచి చేరికలు ఉండనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ పార్టీ కార్యాలయాన్ని జూన్‌ లేదా జూలై నెలలో ప్రారంభించే అవకాశాలున్నాయి.

పట్నాయక్‌కు ప్రత్యమ్నాయం.. కమలానికి చెక్‌

మధ్యప్రదేశ్‌తో పాటే ఒడిశాలోనూ విస్తరించే ప్రయత్నంలో భారాస అధిష్టానం ఉంది. ఒడిశాలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేసిన గులాబీ బాస్‌.. ఇక్కడ పార్టీ బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బావిస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు తిరుగు లేదు. కానీ వరుసగా గెలుస్తున్న పెద్దగా అభివృద్ధి జరగలేదన్న బావనలో అక్కడి ప్రజలు ఉన్నట్లుగా గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఇప్పటికే బీజేపీ పని చేస్తోంది. ఈ రాష్ట్రానికి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గిరిజనులు, దళితులకు పెద్ద పీట వేస్తున్నామంటూ కమలనాథులు జనంలోకి వెళ్లే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. ఇక్కడ బీజేడీ పార్టీకి తప్ప ఇతర ఏ పార్టీలకు పెద్దగా ఆదరణ లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యమ్నాయంగా నైనా నిలవాలని బీజేపీ ముందు నుంచే వ్యూహాలను రెడీ చేసుకుంది. ఇదే అదనుగా బావిస్తున్న భారాస త్వరలోనే ఆ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగే విధంగా స్కెచ్‌లు సిద్ధం చేసింది. ఇతర పార్టీల్లోని సీనియర్‌ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అక్కడి వారిని పార్టీలో చేర్చుకొని గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసే దిశగా వడవడిగా అడుగులు వేస్తున్నారు.

ఛత్తీస్‌ఘడ్‌లో చక్రం తిప్పుదాం

కాంగ్రెస్‌, బీజేపీ చెరో సారి గెలుపొందుతూ వస్తున్న మరో రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌. ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. అభివృద్ధి ఫలాలు అందక వెనకబడి ఉన్నారన్న అంచనాలో కారు నేతలు ఉన్నారు. తెలంగాణ మోడల్‌ను జనంలోకి తీసుకువెళ్తే ఎలా ఉంటుందన్న చర్చలు చేశారు. మూడో పార్టీకి ఇక్కడ మంచి భవిష్యత్‌ ఉన్నట్లుగా సర్వేలు, రిపోర్టులతో రాజకీయ పరిస్థితులపై అధినేత అంచనా వేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు ప్రత్యమ్నాయంగా మరో పార్టీ వస్తే ప్రజలు ఆదరిస్తారన్న ఖచ్చితమైన సమాచారంతో కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడా గులాబీ జెండా పాతేలా ప్రయత్నిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. స్థానిక సమస్యలే ప్రధాన అంశంగా తీసుకోనున్నారు. పోరాట పంథాను వదలకుండా.. జనం మనస్సులను గెలుచుకునేలా వ్యూహాలను రెడీ చేశారు. చాప కింద నీరులా ఇప్పటికే అక్కడ పార్టీ పనులను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాదిపై పట్టుకు ప్రయత్నం

ఉత్తరాది రాష్ట్రాల్లో మరో పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్‌ పైనా బీఆర్‌ఎస్‌ నజర్‌ పెట్టింది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. గత సారి బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలే చెరో ఐదేళ్లు అధికారాన్ని పంచుకున్నట్లుగా అక్కడి పరిస్థితులున్నాయి. ఇక్కడ కూడా భారాస బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధినేత బావిస్తున్నారు. ఈ రాష్ట్రంలోనూ పాగ వేసేలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా ఇక్కడి విస్తరణ పనులను పర్యావేక్షించనున్నారు. ఇప్పటి వరకు అవకాశాలు రాని వారికి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగల సమర్థులకు అక్కడి బాధ్యతలను కట్టబెట్టే ఆలోచనలో అధినేత ఉన్నట్లుగా సమాచారం. రాజస్థాన్‌లో నిలదొక్కుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభావం చూపించోచ్చని, చిన్న రాష్ట్రాల్లో కూడా ఫోకస్‌ చేసే అవకాశం ఉటుందని బావిస్తున్నారు. ముందుగా రాజస్థాన్‌లో అడుగు పెట్టాలన్న గట్టి నిర్ణయంతో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement