Thursday, May 16, 2024

AP | ఏపీలో 46,389 పోలింగ్‌ కేంద్రాలు.. ఓటర్ల వివరాలివే : సీఈఓ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లకు సంబంధించిన వివరాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

ఇక ఈ ఎన్నికల కోసం మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖేశ్ కుమార్ మీనా వివరించారు. ఒక్కో కేంద్రంలో 1500 మంది ఓట్లు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని…. 224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపామన్నారు.

64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్…

రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‍కాస్టింగ్ చేయాలని పర్యవేక్షకుల నుంచి సిఫార్సులు అందాయన్నారు.

ఇందులో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇక‌, ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయని.. పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ కిట్ లు కూడా ఏర్పాటు చేస్తున్నామని, నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.

- Advertisement -

తనిఖీలు ముమ్మరం.. 203కోట్ల సొత్తు సీజ్

ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇప్పటివరకు సీ విజిల్ యాప్ ద్వారా 16,345 ఫిర్యాదులు అందాయని ముఖేశ్ కుమార్ మీనా చెప్పారు. ఇందులో 10,403 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని చెప్పారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా…. 156 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు.

ఏపీ వ్యాప్తంగా 150 అంతరాష్ట్ర చెక్‍ పోస్టులు ఉన్నాయిని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఇప్పటివరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేశామని… రూ.105 కోట్ల విలువైన నగలు, 47 కోట్ల నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు. రూ.28 కోట్ల విలువైన మద్యం, రూ.3.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement