Tuesday, May 14, 2024

Delhi | జగన్‌ది ఫ్యాక్షన్ కక్ష.. తప్పుడు కేసులు టీడీపీని ఏం చేయలేవు: లోకేష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వంతో కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం ఎంపీలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. ధర్మమే తెలుగుదేశం పార్టీకి రక్షణగా నిలుస్తుందని నారా లోకేశ్ పేర్కొన్నారు.

చంద్రబాబును అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని, తప్పుడు కేసులు, వాటిపై చేస్తున్న న్యాయపోరాటం గురించి పార్టీ ఎంపీలతో లోకేష్ చర్చించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకున్నా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 14వ నిందితుడిగా లోకేశ్ పేరును చేర్చడంపై కూడా స్పందించారు. ఇది ముమ్మాటికీ సీఎం జగన్ మార్క్ ఫ్యాక్షన్ కక్షసాధింపు చర్యేనని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్టు చేసినట్టే, లోకేశ్‌ను కూడా సంబంధమే లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఎన్ని కేసులు పెట్టి వేధించినా ధర్మం తమ పక్షానే ఉందని, న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, కక్షసాధింపు రాజకీయాలపై జాతీయస్థాయిలో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. తప్పుడు కేసులు – నిజాలు పేరుతో రూపొందించిన పుస్తకాలు, ఇతర సమాచారాన్ని జాతీయ మీడియాతో పాటు, జాతీయ నాయకులకు అందజేయాలని, అక్కడి పాలన గురించి వివరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement