Sunday, April 28, 2024

Delhi | ఏపీలో రాజకీయ కక్షసాధింపు చర్యలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: లోకేశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ (నాని), కే. రామ్మోహన్ నాయుడుతో పాటు ఆయన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలతో నారా లోకేశ్ ఒక లేఖను, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారంటూ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఒక లేఖను రాష్ట్రపతికి అందజేశారు.

రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్, 2019 నుంచి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలపై జరుగుతున్న అరాచకాల గురించి రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. స్కిల్ డెలవలప్మెంట్ పథకంలో ఎలాంటి అవినీతి లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని, ప్రతిపక్ష పార్టీలను కేసుల పేరుతో వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, ఏపీలో పరిస్థితుల గురించి తెలుసుకుంటామని చెప్పారని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలతో పాటు సామాన్యుల గొంతును నోక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అయినా సరే తమ పోరాటం ఆగదని, పోరాటాన్ని ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళతామని తెలిపారు. యువగళం పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించిన వెంటనే బహుమతిగా తనను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14 గా చేర్చారని నారా లోకేశ్ అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని హెచ్చరించారు.

ఢిల్లీలో అరెస్టు చేసే సత్తా లేదా?
ఢిల్లీ వచ్చి అరెస్ట్ చేసే సత్తా అధికారులకు లేదా అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టే కేసులో ఏం లేదని తేలిపోయింది కదా అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ కేసులో బలం ఉంటే ఎక్కడికైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది కదా అని అన్నారు. న్యాయ పోరాటం కోసమే ఢిల్లీకి వచ్చానని, ఢిల్లీలో న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలను కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తున్నానని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసులతో తనకు సంబంధం లేదని తెలిపారు.

- Advertisement -

అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని, అందులో ఉన్న కేసు ఏంటో కూడా తనకు అర్థం కాలేదని అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర, యువగళం, వారాహి యాత్రలతో ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమపై దొంగ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దర్యాప్తు సంస్థ సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కక్ష సాధింపు తప్ప ఏ ఒక్క కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏ ఒక్క కేసులోనూ తనకు, తన కుటుంబానికి, తన సన్నిహితులకు ఒక్క పైసా కూడా రాలేదని చెప్పారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా అడ్డుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎలాంటి ఆధారాలు లేవు
ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని, న్యాయం ఆలస్యం అవుతుందే తప్ప, న్యాయం తప్పకుండా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సిఐడీ ఆరోపిస్తున్న కంపెనీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, వాళ్ల దగ్గర కనీసం కప్పు టీ కూడా తాగలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆయనకి సంఘీభావంగా నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. శాంతియుతంగా చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నారని, తమ నాయకుడిని అరెస్ట్ చేశారన్న బాధతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని వెల్లడించారు. ఎక్కడా శాంతిభద్రతలకు ఇబ్బంది కలగలేదని అన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లేటప్పుడు సైతం శాంతియుతంగా పోరాటం కొనసాగించమని గుర్తుచేశారు.

త్వరలో యువగళం ప్రారంభిస్తా
తాను త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానని, యువగళం పాదయాత్ర త్వరలోనే ప్రారంభిస్తానని అన్నారు. అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. బుధవారం తమ నేత చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతుందని, ఆ కేసు విచారణ పూర్తయిన తర్వాత తాను ఏపీకి వెళ్లి యువగళం యాత్ర ప్రారంభిస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement